చర్చలు సఫలం.. సాంచాలు ప్రారంభం

చర్చలు సఫలం.. సాంచాలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : పెండింగ్‌‌‌‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు, ఆసాములు ఎట్టకేలకు తమ సమ్మె విరమించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్‌‌‌‌ ఇచ్చింది. కానీ వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన రూ. 300 కోట్లు విడుదల చేయలేదు. దీంతో వాటిని వెంటనే విడుదల చేయాలని కార్మికులు, ఆసాములు 45 రోజుల కింద సమ్మెకు దిగారు. వీరికి పలు పార్టీల లీడర్లు సైతం మద్దతు ప్రకటించారు. అయితే నేతన్నలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో బుధవారం సమ్మె విరమించి పనుల్లో చేరారు.

ఫలించిన మంత్రి పొన్నం చర్చలు

బకాయిలు విడుదల చేయాలని సమ్మె చేస్తున్న సిరిసిల్ల నేతలతో మంత్రి పొన్నం చర్చలు ఫలించాయి. ఈ నెల 8న సిరిసిల్లలోని పద్మశాలీ సంఘం భవనంలో నేతన్నలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. నేత కార్మికులు, ఆసాములు, పాలిస్టర్‌‌‌‌ సంఘాల లీడర్లు, ఇతర వస్త్ర వ్యాపారులతో చర్చలు జరిపారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్‌‌‌‌ ఇచ్చి రూ. 300 కోట్లు బకాయి పెట్టిందని, దీంతో అప్పుల్లో కూరుకుపోయామని నేతన్నలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విడతలవారీగా బకాయిలు విడుదల చేస్తామని, నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తనపై నమ్మకంతో సమ్మె విరమించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆర్‌‌‌‌వీఎం ఆర్డర్‌‌‌‌ను కొనసాగించాలని చెప్పారు.

కార్మికుల ఉపాధికి హామీ

సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారం రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షకంగా 20 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కల్పించిన పని రోజుల కంటే తాము ఎక్కువ కల్పిస్తామని, నేతన్నలు కొత్త ఉత్పత్తులు ప్రారంభించేందుకు, స్కిల్స్‌‌‌‌ను పెంచుకునేందుకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆసక్తి గల నేత కార్మికులను సూరత్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తీసుకెళ్తామని చేనేత, జౌళీ శాఖ డైరెక్టర్‌‌‌‌ అలుగు వర్షిణి చెప్పారు. ఆధునిక మరమగ్గాల కొనుగోలుకు బ్యాంక్‌‌‌‌ రుణాలు ఇస్తామని చెప్పారు. నేతన్నలు సొంత కాళ్లపై నిలబడేలా, మార్కెట్ అనుకూలంగా వస్త్రాన్ని ఉత్పత్తి చేసినప్పుడే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాధిస్తుందని చెప్పారు.

మంత్రి హామీతో సమ్మె విరమించాం 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. బుదవారం నుంచి సాంచాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం నుంచి అందిన ఆర్వీఎం బట్ట ఉత్పత్తికి కార్మికులు పనిచేస్తరు. సిరిసిల్ల కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త ఆర్డర్లు ఇవ్వాలి. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం.
- మండల సత్యం, పాలిస్టర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు, సిరిసిల్ల