ఐదేండ్లుగా ఆశల్లోనే నేత కార్మికులు

ఐదేండ్లుగా ఆశల్లోనే నేత కార్మికులు
  • నత్తనడకన సాగుతున్న వీవింగ్​ పార్క్​పనులు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: ఆసాముల వద్ద పని చేసే కార్మికులను యజమానులుగా మార్చేందుకు ‘వర్కర్ టు ఓనర్’ పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన  వీవింగ్​పార్క్ పనులు నత్తనడకను సాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికులు ఎక్కువ మంది ఉండడంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వర్కర్​టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. సిరిసిల్లలో రూ. 220 కోట్లతో వీవీంగ్ పార్క్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులోని 88.3 ఎకరాల్లో రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) దీని నిర్మాణాన్ని చేపట్టింది. వీవింగ్​పార్క్ నిర్మాణంలో సెమీ ఆటోమెటిక్  మరమగ్గాలను ఏర్పాటు చేసి మోడ్రన్  వస్త్రాలను నాణ్యతతో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఒకేసారి నాలుగు రంగుల నూలు ఉపయోగించి ఎక్కువ డిజైన్లతో బట్ట  ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో డిమాండ్ వచ్చే విధంగా మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. సిరిసిల్లలో ఈ పథకం సక్సెస్ అయితే ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఐదేండ్లు గడుస్తున్నా వీవింగ్ షెడ్ల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. 

పది వేల మందికి ఉపాధి

వర్కర్ టు ఓనర్ పథకంలో కార్మికుడికి ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుంది. 40 శాతం బ్యాంక్ లోన్​ఇస్తారు. కార్మికుడు కేవలం పది శాతం చెల్లిస్తే చాలు. ఒక్కో కార్మికుడికి ఒక యూనిట్ కింద రూ. 8 లక్షలు విలువ చేసే నాలుగు ఆధునిక మరమగ్గాలను సమకూరుస్తారు. ఒక్కో షెడ్డులో 8 మంది కార్మికులకు యూనిట్లు కేటాయిస్తారు. ఆధునిక మరమగ్గాలపై వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తారు. వర్కర్​టు ఓనర్ పథకం కార్యరూపం దాలిస్తే దాదాపు పదివేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో 30,352 మరమగ్గాలు ఉన్నాయి. వీటిలో 4 వేల నుంచి 6 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అదే వీవింగ్​పార్కల్​లో అయితే అనుబంధ రంగాల కార్మికులు డైయింగ్, వై పని, కండెలు చుట్టేవారు ఇలా  మొత్తం కలిపి పదివేల మంది కార్మికులకు శాశ్వత ఉపాధి లభించనుంది.

వానలతో పనుల్లో జాప్యం

వానల కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోంది. షెడ్ల నిర్మాణ పనులు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ లోగా షెడ్లు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం. ఇప్పటికే నాలుగు మోడల్ లూమ్స్ బిగించాం. ఈ మోడల్ లూమ్స్ నుంచి వచ్చే రిజల్ట్ ద్వారా మిగితా లూమ్స్ బిగిస్తాం. షెడ్ల పనులు పూర్తయిన వెంటనే బెనిఫిషర్స్ ను ఎంపిక చేస్తాం. 

- అశోక్ రావు, డిప్యూటీ డైరెక్టర్, చేనేత జౌళిశాఖ

ఏండ్లుగా ఎదురుచూస్తున్నం

సిరిసిల్లలో చాలామంది కార్మికులు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. చాలాకాలంగా కార్మికులుగానే ఉన్నాం. వర్కర్​టు ఓనర్ పథకం అమలైతే ఓనర్లం కావచ్చని చాలా ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. కేటీఆర్ సారు చాలాసార్లు నేత కార్మికులను ఓనర్లను చేస్తామని చెప్పిన్రు. కానీ ఎప్పటికి చేస్తరో అర్థమయితలేదు. త్వరగా కార్మికులకు శాశ్వత పరిష్కారం చూపెడితే బాగుంటుంది. 

‌‌- నక్క దేవదాస్, పవర్​లూమ్ కార్మికుడు, సిరిసిల్ల