ఘనంగా బల్కంపేటఎల్లమ్మ కల్యాణం..తరలివచ్చిన వేలాది మంది భక్తులు

ఘనంగా బల్కంపేటఎల్లమ్మ కల్యాణం..తరలివచ్చిన వేలాది మంది భక్తులు
  1. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం 
  2. తరలివచ్చిన వేలాది మంది భక్తులు, శివసత్తులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం11:51 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి పెళ్లి జరిపారు. ఈ కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణానికి ఉదయం 5 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. 

సాధారణ భక్తులు, వీఐపీల ఎంట్రీ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి కల్యాణాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు, శివసత్తులు తరలివచ్చారు. కల్యాణం సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళసూత్రం సమర్పించారు. 

అమ్మవారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. కల్యాణ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. మొదటి రోజు పెళ్లికూతురు, ఎదుర్కోళ్ల కార్యక్రమం, రెండో రోజు కల్యాణం, మూడో రోజు రథోత్సవం జరగనుంది. అమ్మవారి కల్యాణం సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్‌‌‌‌నగర్, ఎస్సార్‌‌‌‌నగర్, అమీర్‌‌‌‌పేట్ మార్గాల్లోని పలు రోడ్లను మూసివేశారు. 

కల్యాణానికి ఆలయ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రమాదాలు జరగొద్దని మొక్కుకున్న: పొన్నం 

బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అప్పట్లో నగరంలో విపత్తు వచ్చి వందల మంది చనిపోతున్నప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి వెలసి, ప్రజలను కాపాడిందన్నారు. రాష్ట్రమంతా సరిపడా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇటీవల అవాంఛనీయ సంఘటనలు, అగ్ని ప్రమాదాలు , విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుకున్నానని చెప్పారు. 

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్న: కొండా సురేఖ

నగర ప్రజ‌‌‌‌ల బాధ‌‌‌‌లను తీర్చే దైవం బ‌‌‌‌ల్కంపేట ఎల్లమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. బోనం అంటే భోజ‌‌‌‌న‌‌‌‌మ‌‌‌‌ని, గ‌‌‌‌తంలో ఇక్కడ ఒక మ‌‌‌‌హ‌‌‌‌మ్మారి విభృంజిస్తున్న స‌‌‌‌మ‌‌‌‌యంలో బోనాల సంస్కృతి వ‌‌‌‌చ్చింద‌‌‌‌ని.. అది ఇక్కడి ప్రజ‌‌‌‌ల న‌‌‌‌మ్మకమన్నారు. ఈసారి బోనాల వేడుకలకు ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించి, ఘనంగా నిర్వహిస్తోందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవ‌‌‌‌కాశం త‌‌‌‌న‌‌‌‌కు రావ‌‌‌‌డాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. రాష్ట్రమంతా మంచిగా వర్షాలు పడాలని, ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు.