
- రోజూ రూ.15 కోట్ల రెవెన్యూ,75 శాతం ఓఆర్
- సీసీఎస్కు రూ.150 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశం
- ముగిసిన గడువు, నిధులు విడుదల చేయని మేనేజ్ మెంట్
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీకి పెళ్లిళ్లు కొత్త జోష్ ఇస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 25 వరకు సంస్థకు రోజువారి రెవెన్యూ రూ.15 కోట్లు వచ్చాయి. మార్చ్, ఏప్రిల్ నెలల్లో రోజుకు రూ.12 కోట్ల ఆదాయం రాగా, పెళ్లిళ్ల సీజన్ లో ఏకంగా రోజువారి ఆదాయం రూ.3 కోట్లు పెరిగింది. వచ్చే నెల 10 వరకు రాష్ర్టంలో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో అప్పటి వరకు ఇదే స్ధాయిలో రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 25 రోజుల్లో 5 రోజులు ఆదాయం రూ.16 కోట్లు దాటింది. అలాగే పెళ్లిళ్ల సీజన్ లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా 75 శాతానికి చేరింది.
రూ.150 కోట్లు చెల్లించాలే
సీసీఎస్కు ఈ నెల 25 వరకు రెండు దశల్లో రూ.150 కోట్లు చెల్లించాలని గతనెల 28న ఆర్టీసీని హైకోర్టు ఆదేశిచింది. ఈ గడువు ముగిసినా ఆర్టీసీ మేనేజ్మెంట్ నిధులు విడుదల చేయలేదని సీసీఎస్ అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతి నెలా ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి సీసీఎస్ కోసం కట్ చేస్తున్న రూ.18 కోట్లను విధిగా ప్రతి నెలా చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా వాటిని కూడా మేనేజ్మెంట్ చెల్లించడం లేదు. వేసవి సెలవులు పూర్తయ్యాక వచ్చే నెల 8న ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఉద్యోగుల పిల్లల చదువులకు, ఇళ్ల నిర్మాణం, పెళ్లిళ్లు వంటి అవసరాలకు తక్కువ వడ్డీకి సీసీఎస్ రుణాలు ఇస్తుంది. ఆర్టీసీ మేనేజ్మెంట్ నిధులు ఇవ్వని కారణంగా రెండేళ్లుగా ఏడువేల లోన్
అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
రెవెన్యూ అంతా ఏమవుతోంది?
ఆర్టీసీకి రెవెన్యూ వస్తున్నా సీసీఎస్, పీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవటంపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. గతంలో రోజుకు రూ.12 కోట్ల రెవెన్యూ వచ్చేదని, ప్రస్తుతం రూ.15 కోట్ల ఆదాయం వస్తుంటే తమకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని మేనేజ్ మెంట్ పై ఉద్యోగులు మండిపడుతున్నారు.