భేటీ కానున్న ఇండియా–చైనా ఆర్మీ అఫీషియల్స్‌

భేటీ కానున్న ఇండియా–చైనా ఆర్మీ అఫీషియల్స్‌

న్యూఢిల్లీ: ఇండియా–చైనాల సీనియర్ ఆర్మీ అఫీషియల్స్ సోమవారం భేటీ కానున్నారు. ఇరు దేశ సైన్యాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 15న తూర్పు లడాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియన్ సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) దగ్గర పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని తెలిసింది. ఇరు దేశాలూ ఎల్‌ఏసీ వెంబడి తమ సైనికులను పూర్తిగా మోహరిస్తుండటంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. గల్వాన్ ఘర్షణకు ముందు ఈ నెల 6న లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోపాటు మరికొందరు ఆఫీసర్స్‌ కలసి చైనా దళాలతో చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా తరఫున మేజర్ జనరల్ లిన్ లియూ తమ ఆర్మీకి అధ్యక్షతన వహించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్మీ సీనియర్స్ యత్నించినప్పటికీ చర్చలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే భేటీ ఎంతవరకు సక్సెస్ అవుతుందోననేది ఆసక్తి రేపుతోంది.