ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు నేటి నుంచే

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు నేటి నుంచే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్స్  ఇవ్వనున్నారు. పోలీసులకు వీక్లీఆఫ్‌ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని విశాఖ, కడప, ‘ప్రకాశం’ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం) నుంచి మొత్తం 70 వేల మంది పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం 19 ఆప్షన్స్‌ (మోడల్స్‌)ని ఎంపిక చేశామన్నారు. ప్రతీ యూనిట్‌ ఆఫీసర్‌ వాటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రతి యూనిట్‌ నుండి రెండు నెలలకోసారి సమాచారం తీసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఈ నిర్ణయం కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకు వర్తిస్తుందన్నారు. వీక్లీఆఫ్‌ అమలుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే హెడ్‌ క్వార్టర్స్‌ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటామన్నారు. అలాగే, వీఆర్‌లో ఉన్నవారిని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీక్లీ ఆఫ్‌లతో షిఫ్ట్‌ డ్యూటీస్‌ కూడా ఉంటాయన్నారు.

వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తుండడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌, డీజీపీలకు పోలీసు అధికారుల సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు.