తూకంలో మోసం: వ్యాపారిని బంధించిన రైతులు

తూకంలో మోసం: వ్యాపారిని  బంధించిన రైతులు

నాగర్ కర్నూలు జిల్లా: మొక్కజొన్న తూకంలో మోసం చేసిన ఓ వ్యాపారిని రైతులు బంధించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా  బిజినపల్లి మండలం వసంతాపూర్ లో జరిగింది. సత్యం అనే వ్యాపారి గ్రామంలో రైతుల దగ్గర మొక్కజొన్న సేకరించాడు. అయితే తూకంలో తేడా ఉందని కొందరికి అనుమానం కలిగింది. దీంతో PACS నుంచి కాంటాను తెచ్చి మరోసారి తూకం వేయగా ఒక్కో బస్తాలో 2 నుంచి 3 కిలోలు తేడా వచ్చింది. ఆగ్రహం చెందిన రైతులు వ్యాపారి సత్యంను 4 గంటల పాటు గ్రామంలో బంధించారు. ఇతర వ్యాపారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. తూనికలు, కొలతల అధికారులు గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బస్తాకు 2 కిలోలు తేడా ఉన్నట్టు గమనించి 5 బస్తాలను, ఎలక్ట్రానిక్ కాంటాను సీజ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు రైతులు.