గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు.. 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తం: మంత్రి వివేక్‌‌

గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు.. 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తం: మంత్రి వివేక్‌‌
  • నాలుగు లక్షల మందికి ప్రయోజనం
  • గిగ్​ వర్కర్ల సమస్యలను కమిటీకి నివేదించవచ్చు
  • ప్లాట్​ఫామ్​ కంపెనీలపై నిబంధనలు ..బీమా, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్స్‌‌కు ప్రణాళికలు 
  • అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన వివేక్ ..ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు

హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల హక్కులు, సామాజిక భద్రత, డిజిటల్​ ఆర్థిక వ్యవస్థలో చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ప్రత్యేక బిల్లును తీసుకొచ్చినట్టు కార్మిక శాఖా మంత్రి వివేక్​ వెంకటస్వామి పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 20 మంది సభ్యులతో బోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి 3 నెలలకోసారి సమావేశాలు ఉంటాయన్నారు. గిగ్​ వర్కర్లు సమస్యలుంటే కమిటీకి నివేదించవచ్చని తెలిపారు.  సోమవారం శాసనసభ, శాసన మండలిలో ‘తెలంగాణ ప్లాట్ ఫామ్​ ఆధారిత గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు– 2026’ను మంత్రి  వివేక్ వెంకటస్వామి ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఎంతో మంది గిగ్ వర్కర్లను కలిశారని, వారి సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు.  

గిగ్ వర్కర్లకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత, కనీస వేతనం లేదని, వారికి ఎన్నో సమస్యలున్నాయని తెలుసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో గిగ్ వర్కర్స్ కోసం భద్రత కల్పించాలని రాహుల్‌ ఆదేశించారని మంత్రి వివేక్​ తెలిపారు. అగ్రిగేటర్లతో మాట్లాడి, లేబర్ సంఘాలతో చర్చించి చట్టం తీసుకురావాలని కోరారని పేర్కొన్నారు. 

గిగ్​ వర్కర్ల హక్కులు, గౌరవం, జీవనోపాధిని కాపాడేలా నిబంధనలు రూపొందించామని వివేక్‌‌‌‌ చెప్పారు. ఈ బిల్లులో భాగంగా ప్లాట్​ఫామ్​ సంస్థలు క్రమం తప్పకుండా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని, ప్రతి 3 నెలలకు ఎలక్ట్రానిక్ రిటర్న్ ఇవ్వాలని, నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించనున్నట్టు పేర్కొన్నారు. మొదటి తప్పిదానికి రూ.50 వేలు, రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.1.5 లక్షలు, ఆ తర్వాత బకాయిలపై ఐదురెట్లు వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.  

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్స్
దేశవ్యాప్తంగా, తెలంగాణలో ప్లాట్‌‌‌‌ఫామ్ ఆధారిత గిగ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి వివేక్‌‌‌‌ తెలిపారు. ఐటీ మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ కారణంగా హైదరాబాద్‌‌‌‌ డిజిటల్ ఇన్నోవేషన్, ఆన్‌‌‌‌లైన్ సేవల కేంద్రంగా ఎదిగిందని, దీనివల్ల రైడ్ షేరింగ్, గ్రాసరీ డెలివరీ, ఈ-–కామర్స్, హెల్త్‌‌‌‌కేర్, లాజిస్టిక్స్, కంటెంట్ సర్వీసులు తదితర రంగాల్లో డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. 

ఉబెర్, స్విగ్గీ, జొమాటోలాంటి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లపై ఆధారపడటంతో గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, కార్మిక హక్కుల లేమి, సంఘటితమయ్యే హక్కు లేకపోవడం, ఫార్మల్ సోషల్ సెక్యూరిటీ అందుబాటులో లేకపోవడం, ఫిర్యాదుల పరిష్కారానికి సరైన వ్యవస్థ లేకపోవడంలాంటి కీలక సమస్యలు ముందుకొచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాట్‌‌‌‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లు సామాజిక సంక్షేమం, భద్రత సముచిత పని పరిస్థితుల పరిధి నుంచి బయట పడకుండా ఉండేందుకు చట్టపరమైన సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అత్యవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.

అగ్రిగేటర్లపై 1 నుంచి 2 శాతం వరకు లెవీ విధించి సంక్షేమ నిధిని సృష్టించి.. బీమా, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలులాంటి పథకాలను అమలు చేయాలని ప్రతిపాదించామన్నారు. పని విధానాల్లో పారదర్శకతను నిర్ధారించడం, వేతనాల నుంచి తగ్గింపులపై స్పష్టత ఇవ్వడం, అల్గారిథమ్‌‌‌‌ల వినియోగంలో వివక్ష లేకుండా చూడడంలాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చినట్టు చెప్పారు. 

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్స్, ప్లాట్‌‌‌‌ఫామ్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. నిరంతర ఆడిట్లు, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాల ద్వారా బాధ్యతను నిర్ధారించనున్నట్టు చెప్పారు. ఈ చట్టం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్ల పాత్రను గుర్తిస్తూ వారి హక్కులు, జీవనోపాధిని రక్షించే దిశగా ఒక  ప్రగతిశీల అడుగు వేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్మిక, సామాజిక భద్రత చట్టాలకు ఇది అనుబంధంగా పనిచేస్తూ, ఈ కొత్త రంగంలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఇకపై యాప్ కంపెనీల ఇష్టారాజ్యం సాగదు
అగ్రిగేటర్ కంపెనీలు  తమ ఇష్టం వచ్చినట్టు వర్కర్ల ఐడీలను బ్లాక్ చేయడం, పని ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నాయని మంత్రి వివేక్‌‌‌‌ అన్నారు.  ఇకపై అలా కుదరదని,  ఒకవేళ కంపెనీ అన్యాయంగా తీసేస్తే.. వర్కర్లు కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ఓనర్ కమ్ డ్రైవర్లను కూడా గిగ్ వర్కర్లుగానే గుర్తిస్తామని,  ప్రతి నెలా 2 శాతం నిధులు వెల్ఫేర్ బోర్డుకు వెళ్తాయని, వీటిని వర్కర్ల సంక్షేమం కోసం వాడతామని వివరించారు. 

త్వరలోనే అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కోసం రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతామని హామీ ఇచ్చారు. శాసన సభ, మండలిలో  తెలంగాణ గిగ్ వర్కర్ల సోషల్ సెక్యూరిటీ బిల్లుపై సభ్యులు మాట్లాడిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  కాగా, సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు మంత్రి వివేక్​ సావధానంగా సమాధానం ఇచ్చారు.

గిగ్‌‌‌‌ వర్కర్ల చట్టం అభినందనీయం: ఎమ్మెల్యేలు మక్కాన్​సింగ్ ఠాకూర్​, సంజీవరెడ్డి 
భారత్ జోడో యాత్రలో భాగంగా డెలివరీ బాయ్స్‌‌‌‌తో రాహుల్ గాంధీ మాట్లాడి.. వారి కష్టాలను తెలుసుకున్నారని, ఆ స్ఫూర్తితోనే ఈ బిల్లు తెచ్చామని ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. గిగ్​ వర్కర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వీరిలో చాలామంది పీజీలు, ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ యువత ఉన్నారని తెలిపారు.  గత ప్రభుత్వం వీరిని విస్మరించిందని, తమ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నదన్నారు.

గిగ్​ వర్కర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలి: ఎమ్మెల్యే బలాలా
స్కిల్ యూనివర్సిటీలో గిగ్​ వర్కర్లకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని మలక్​ పేట ఎమ్మెల్యే అబ్దులా బలాలా కోరారు. గిగ్ వర్కర్లకు భరోసా కల్పించాలని, కనీస ఆదాయం గ్యారెంటీగా ఉండాలన్నారు. సంక్షేమ బోర్డుతోపాటు  ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్‌‌‌‌ చేశారు.  వారికి లోన్​ సౌకర్యం కల్పించాలని, తక్కువ వడ్డీకే వాహన రుణాలు అందించాలన్నారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి ఊరటనిచ్చేలా పోలీసులకు ప్రభుత్వం సూచనలు చేయాలన్నారు.

బెనిఫిట్స్ అందజేయాలి: ఎమ్మెల్యే హరీశ్​బాబు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షలకుపైగా మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కోటి మంది ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​బాబు అన్నారు.  గిగ్ వర్కర్ల కోసం కొన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉందని,  డెలివరీ బాయ్స్, ఉబెర్ డ్రైవర్ల కు ప్రభుత్వం బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. డెలివరీ బాయ్స్, ఉబెర్, ఓలా డ్రైవర్స్‌‌‌‌కు కనీస సెక్యూరిటీ లేదన్నారు. ఆ యాప్స్‌‌‌‌ను ప్రభుత్వమే తన అధీనంలోకి తీసుకొని నడిపిస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు.

గిగ్ వర్కర్ల హక్కులేవి?: తీన్మార్ మల్లన్న
బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక సూచనలు చేశారు. ‘‘నేను ఎక్స్‌‌‌‌పెక్ట్ చేసినంత బలంగా బిల్లు లేదు. కంపెనీల బాధ్యతలను క్లియర్ గా చెప్పలేదు. వెల్ఫేర్ కమిటీలో గిగ్ వర్కర్లకు 51 శాతం వాటా ఇవ్వాలి. అకౌంట్ బ్లాక్ అయితే ఎన్ని రోజుల్లో సమస్య తేలుస్తారో స్పష్టత ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. కమిటీలో అంతా అధికారులే ఉన్నారని, గిగ్ వర్కర్లకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులతో పాటు రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.

బిల్లు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి: అద్దంకి దయాకర్
గిగ్‌‌‌‌ వర్కర్ల చట్టానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేసే ముందు వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌ కోరారు. గిగ్ వర్కర్ల పూర్తి అడ్రస్‌‌‌‌లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉండాలని, అప్పుడే దాడులు జరిగినప్పుడు రక్షణ ఉంటుందన్నారు. గిగ్‌‌‌‌ వర్కర్లకు కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలని కోరారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ఈ చట్టాన్ని తెచ్చారని ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ పేర్కొన్నారు.  గిగ్ వర్కర్లకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు.

గిగ్​ వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది: పొన్నం
గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్​స్వామి ఆధ్వర్యంలో  గిగ్ వర్కర్స్ చట్టం తేవడం శుభపరిణామమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్‌‌‌‌తో సమావేశం నిర్వహించారని, లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లులో వృత్తిపరంగా ఆరోగ్యపరమైన అంశాలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రభుత్వం సహాయం అందించడంలాంటివి  ఉన్నాయన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో హైదరాబాద్ ఇన్‌‌‌‌చార్జి మంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి: ఎమ్మెల్యే కూనంనేని
గిగ్​ వర్కర్ల మాదిరిగానే అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశిరావు కోరారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే రాహుల్ గాంధీ ఆలోచనలను అమ లు చేస్తున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామికి ఆయన అభినందనలు తెలిపారు.  అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు. యజమాని, కార్మికుడు, ప్రభుత్వం కలిసి పీఎఫ్ కట్టేలా కొత్త విధానం తీసుకురావాలని కోరారు. రిటైర్మెంట్ తర్వాత రూ. 10 నుంచి 15 వేల పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేయాలని ఆయన కోరారు. 

గిగ్‌‌‌‌ వర్కర్లందరికీ యూనిక్‌‌‌‌ ఐడీ..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు  చొరవ తీసుకొని అందరితో చర్చించి ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేయించామని మంత్రి వివేక్​ చెప్పారు.  బిల్లును సలహాలు, సూచనల కోసం 30 రోజులపాటు పబ్లిక్ డొమైన్‌‌‌‌లో పెట్టామని,  దాదాపు 65 సలహాలు, సూచనలు వచ్చాయన్నారు.  తదుపరి  చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి.. వాటిపై చర్చించినట్టు చెప్పారు. తాను మంత్రి పదవి తీసుకున్న తర్వాత  కూడా ఐదు సార్లు అగ్రిగేటర్లు, లేబర్ యూనియన్లతో సమావేశాలు, చర్చలు జరిపామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్‌‌‌‌కు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుందని తెలిపారు. వారి భద్రత గురించి ఆలోచించడం కూడా అగ్రిగేటర్ల బాధ్యత అని చెప్పామని, ఇది సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.  గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్లతో చర్చించి రూల్స్ తయారు చేస్తారని చెప్పారు. గిగ్ వర్కర్స్‌‌‌‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని, అందుకు ఒక యూనిక్ ఐడీ కేటాయిస్తారని చెప్పారు. అనంతరం వారికి అన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వర్తిస్తాయన్నారు. ఎవరైనా అగ్రిగేటర్లు చట్టవిరుద్ధంగా ఉంటే వారిపై జరిమానా వేస్తామని చెప్పారు.