హైదరాబాద్ సిటీ, వెలుగు: త్వరలో రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు నేతృత్వంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ వెంకటేశం, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు బోస్, జేఏసీ నేతలు సలీమ్, అశోక్, కృష్ణ తదితరులు ఆదివారం అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఆటో డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, మీటర్ చార్జీలు పెంచాలని, ప్రతీ డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వమే ఒక యాప్ ఏర్పాటు చేయాలని, ఎల్పీజీ కొరతను నివారించాలని, జీవో 263 ప్రకారం మిగిలిపోయిన ఆటో పర్మిట్లను జారీ చేయాలనీ విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీటర్ రేట్లు, ఆర్థిక సాయం విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. యాప్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని మిగిలిన ఆటో పర్మిట్లను వెంటనే ఇస్తామని హామీ ఇచ్చారు.
