
ఈ బావి.. ప్రకృతి సృష్టించిన అందమా? లేక ఆత్మలు సృష్టించిన నరక కూపమా? అంటే... కచ్చితంగా అది దుష్ట శక్తులకు నెలవైందని స్థానికులు చెప్తున్నారు. అందుకే దాని గురించి మాట్లాడినా ఏదో ఒక రూపంలో చెడు జరుగుతుందని నమ్ముతున్నారు. అంతెందుకు ఆ బావి దగ్గరకు వెళ్లిన మనుషులు, పక్షులు, జంతువుల జాడ ఇప్పటికీ తెలియలేదు. అందుకే దాన్ని ‘నరక కూపం’ అని పిలుస్తుంటారు. కానీ.. అది ఈ నేచర్‌లో ఏర్పడిన ఒక అద్భుతమని సైంటిస్ట్‌లు అంటున్నారు.
ఇది యెమెన్‌లో తూర్పు దిక్కున ఉన్న ఆల్-మహ్రా ప్రావిన్స్‌లోని పెద్ద ఎడారిలో ఉంది. సిటీలకు, ఎక్కువ జనాలు తిరిగే హైవేలకు దూరంగా ఉన్న ఈ బావిని చాలామంది ‘‘వెల్ ఆఫ్ హెల్”అని కూడా పిలుస్తుంటారు. కొంత ఎత్తు నుంచి దాన్ని చూస్తే.. ఒక కన్ను భూమి నుండి పైకి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాని చుట్టుపక్కలకు వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టమని అక్కడివాళ్లు చెప్తుంటారు. ఒకవేళ వచ్చినా వాళ్లకు ఏదో ఒక రకంగా చెడు జరుగుతుందట.
ఇది చూడ్డానికి విచిత్రంగా ఉన్నా నేచురల్‌గా ఏర్పడిందే అని సైన్స్ చెప్తోంది. ఇది ఒక సింక్ హోల్. కాకపోతే.. ఎవరో తవ్వినట్టు గుండ్రంగా ఉంది. దాదాపు 367 అడుగుల లోతు, 98 అడుగుల వెడల్పు ఉంది. ఎన్నో శతాబ్దాలుగా దీని గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవముంది అనేది ఇప్పటికీ తెలియదు. ఈ బావి దగ్గరికి వెళ్లినా, దాని గురించి ఎవరైనా మాట్లాడినా.. వాళ్లను దురదృష్టం వెంబడిస్తుందని ఇక్కడివాళ్లు నమ్ముతారు. కొన్ని లోకల్ పురాణాల ప్రకారం ఈ బావిలో వెంటాడే ఆత్మలు ఉన్నాయి. వాటికి ఇది జైలు లాంటిది. అవి అందులోనే ఉండి, అక్కడికి వెళ్లినవాళ్లకు కీడు చేస్తుంటాయి. అందుకే ఇక్కడివాళ్లు ఆ బావి దగ్గరకు ఎవరైనా వెళ్తే వాళ్లను మూర్ఖుడిగా భావిస్తారు.
అరుపులు వినిపిస్తాయి
ఆ బావిపై రీసెర్చ్ చేసిన జియాలజిస్ట్ కేవర్ మొహమ్మద్ అల్–కిండికి లోకల్ వాళ్లు ఈ బావి నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయని చెప్పారు. కానీ.. దాన్ని ఆయన కొట్టిపారేశాడు. అయితే.. ఇక్కడివాళ్లు మాత్రం కొన్నిసార్లు అడవి జంతువుల అరుపులు కూడా విన్నట్టు చెప్తున్నారు. అందుకే అక్కడికెళ్లి ఊపిరి పీల్చుకున్నా చెడు జరుగుతుందని నమ్ముతున్నారు. అంతేకాదు.. ఆ బావిలో నుంచి ఒక వింత వాసన వస్తుందని చాలామంది చెప్పారు.
మిస్టరీ వీడినట్టేనా?
ఈ బావి గురించి స్థానికులు ఎన్ని కథలు చెప్తున్నా యెమెన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఒమన్‌లోని ‘‘జర్మన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’’కి చెందిన ఒమన్ కేవ్ ఎక్స్‌ప్లోరేషన్ టీమ్ (ఓసీఈటీ) బావిలోకి దిగాలని డిసైడ్ అయింది. వాళ్లకు జియాలజిస్ట్ అల్–కిండి కూడా తోడయ్యాడు. గతంలో ఒక టీం ఈ బావిలో 60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసింది. పోయినేడాది మాత్రం అల్-–కిండితోపాటు ఓసీఈటీలోని ఐదుగురు రీసెర్చర్లు బావిలోకి దిగారు. వాళ్లు దిగేముందు స్థానికులు అందులో మొసళ్లు, మరెన్నో భయంకరమైన జంతువులు ఉన్నాయని చెప్పారు. కానీ.. వాళ్లకు అలాంటివేమీ కనిపించలేదు.
మొదటి 30 మీటర్లు వెళ్లాక హోల్ డిటైయిల్స్ బాగా కనిపించాయి. కాకపోతే.. లోపల దిగినవాళ్లలో ఉన్న భయం ఏంటంటే.. 2014 నుంచి యెమెన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. అందులో భాగంగా తిరుగుబాటు దారులను కంట్రోల్ చేయడానికి పైలట్లు బాంబులను కొన్నిసార్లు గుహల్లోకి వదిలారు. వాటిలో కొన్ని పేలలేదు. ఇది జనాలు తిరగని ప్రదేశం. పైగా చాలా పెద్ద సింక్‌హోల్ కావడంతో ఇందులో కూడా బాంబులు వేశారేమో అని చాలా భయపడ్డారు. ఆ బాంబులు ఇప్పటికీ పేలకుండా అందులోనే ఉంటే.. ఇప్పుడు పేలితే పరిస్థితేంటి? అనే భయంతోనే లోపలకి వెళ్లారు. కానీ.. టీంకి అలాంటివేమీ కనిపించలేదు. కానీ.. -60 మీటర్ల కిందికి వెళ్లినప్పుడు వింత సంఘటనలు ఎదురయ్యాయని, వింత శబ్దాలు వినిపించినట్టు ఆ టీంలోని కొందరు చెప్పారు. అందరికీ ఒక రకమైన వింత వాసన వచ్చిందట. అయితే.. ఆ వాసనకు కారణం అందులో పడి చనిపోయిన పక్షుల కళేబరాలే అని ఆల్‌కిండి అంచనా వేశారు.
ఏమున్నాయి?
పూర్తిగా కిందికి దిగేసరికి టీంలో ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ఎందుకంటే.. ఆ హోల్ అడుగున పాములు, మనుషులు, జంతువుల ఎముకలు కనిపించాయి. వాళ్లంతా అక్కడే దాదాపు నాలుగు గంటలు ఉన్నారు. అడుగున ఒక నీళ్ల మడుగు రంగు రాళ్లు, ముత్యాలు దొరికాయి వాళ్లకు. ప్రస్తుతం వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు. అయితే.. అందులో ఎముకలు దొరకడంతో స్థానికుల్లో భయం మరింత ఎక్కువైంది. ఆ బావి దగ్గరకు వెళ్లే మనుషులు, జంతువులు, పక్షులను అది మింగేస్తోందనే నమ్మకం ఎక్కువైంది. అందులోకి వెళ్లి వచ్చిన వాళ్లు సేఫ్‌గానే ఉన్నా స్థానికుల్లో మాత్రం భయం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆ బావి దగ్గరకు వెళ్లమనే చెప్తున్నారు. బావిలోకి దిగిన వాళ్లకు ఏదో ఒక రకంగా చెడు జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు.
లోపల వెడల్పు ఎక్కువ
సింక్‌హోల్ పైభాగంలో 98 అడుగుల వెడల్పు ఉంది. కానీ.. లోపలికి వెళ్లే కొద్దీ వెడల్పు పెరిగింది. అడుగుకు వెళ్లేవరకు అది 380 అడుగులకు విస్తరిస్తుంది. అంతేకాదు హోల్‌లో రెండు పొరలున్నాయి. పై పొర సుమారు 200 అడుగుల మందం ఉంది. ఈ పొరలోనే నీళ్లు ఫిల్టర్ అయి కిందికి వెళ్తున్నాయి. అప్పటివరకు అందులోని నీళ్లు విషపూరితమైనవని నమ్మేవాళ్లు. అల్-కిండి అక్కడి నీళ్లు తాగాడు. కానీ.. అతనికి ఏ ప్రమాదమూ జరగలేదు. దీన్ని బట్టి ఆ నీళ్లలో విషం లేదని తేలిపోయింది. ఈ సింక్‌హోల్ కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని -ఆల్ కిండి చెప్పాడు. అయితే.. అది ఎలా ఏర్పడిందనేది మాత్రం ఇంకా తెలియలేదు. స్థానికులు మాత్రం కొన్ని వందల ఏండ్ల క్రితం ఒక రాజు తన నిధిని దాచుకోవడానికి ఈ బావిని తవ్వించాడని నమ్ముతున్నారు. ::: కరుణాకర్ మానెగాళ్ల