
హైదరాబాద్, వెలుగు: మోకాళ్ల రిప్లేస్‌మెంట్ సర్జరీలో రొబోటిక్ ప్రొసీజర్‌ను స్టార్ హాస్పిటల్స్ తీసుకొచ్చింది. ఇందుకోసం యూఎస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ డెవలప్ చేసిన వెలిస్ రోబోటిక్ అసిస్టెన్స్‌ను వాడుతోంది. రోబోటిక్ ప్రొసీజర్ వలన మోకాళ్ల రిప్లేస్‌మెంట్ మరింత మెరుగ్గా జరుగుతుందని, వేగంగా రికవరీ అవ్వొచ్చని స్టార్ హాస్పిటల్స్ వెల్లడించింది. సాధారణ సర్జరీతో పోలిస్తే రొబోటిక్ సర్జరీకి అయ్యే ఖర్చు రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఎక్కువగా ఉంటుందని వివరించింది. వెలిస్ రోబో ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుందని, దీని సాయంతో డాక్టర్లు సర్జరీని మరింత మెరుగ్గా చేస్తారని స్టార్ హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్‌మెంట్ సర్జన్ నీలం వీ రమణారెడ్డి అన్నారు. సర్జరీ టైమ్‌లో ఈ రోబో చేతులను వాడి ఇంప్లాంట్స్, కట్స్ మెరుగ్గా చేస్తారని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం వెలిస్ రోబో యూఎస్‌లో అందుబాటులోకి రాగా, తెలంగాణలో మొదటిసారిగా స్టార్ హాస్పిటల్స్ తీసుకొచ్చింది. ఈ రోబోటిక్ ప్రొసీజర్‌లో అదనంగా సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్స్ వంటివి అవసరం ఉండదు.