గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా సోదరులు నాలుగు వారాల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ (Transit Anticipatory Bail) కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన కేసు దర్యాప్తుకు ఇండియాకి వచ్చి సహకరించడానికి రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో మేము చట్టం నుండి తప్పించుకోవడం లేదని, పని మీద థాయిలాండ్‌కు వెళ్లామని లూత్రా సోదరులు పేర్కొన్నారు.
నిందితుల తరుపున న్యాయవాది మాట్లాడుతూ, లూత్రా సోదరులు నైట్‌క్లబ్‌కు యజమానులు కాదని, కేవలం లైసెన్స్‌దారులు మాత్రమేనని చెప్పారు. వారి పై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను (LOC) ప్రస్తావిస్తూ, మేము తిరిగి వచ్చాక మా చట్టపరమైన పరిష్కారాలను చూసుకోవాలనుకుంటున్నాము అని అన్నారు. కోర్టు ఈ పిటిషన్‌పై గోవా పోలీసుల స్పందన కోరింది అలాగే విచారణను రేపటికి వాయిదా వేసింది.
Also read:- యూట్యూబ్లో చూసి వంట చేయొచ్చేమో గానీ వైద్యం చేయొద్దు..
డిసెంబర్ 7న, అగ్నిప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే సౌరభ్, గౌరవ్ లూత్రా ఢిల్లీ నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు విమానంలో పారిపోయారు. వీరిని గుర్తించి, అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులోకి తీసుకోవడంలో సహాయపడటానికి ఇంటర్‌పోల్ వీరిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తున్న లూత్రా సోదరులకు చెందిన వాగేటర్‌లోని 'రోమియో లేన్' రెస్టారెంట్ భాగాన్ని, అర్పోరా నైట్‌క్లబ్‌ను అధికారులు కూల్చివేయనున్నారు.
ఈ నైట్‌క్లబ్ నలుగురు యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను గోవా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయడానికి గోవా ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

