
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న వేళ.. విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ బలంగా ఉన్న చోట.. మేం వారికి మద్దతిస్తాం. ఇందులో తప్పులేదు. వారు కూడా ఇతర ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలి. ఏదైనా మంచి జరగాలి అంటే మరో చోట త్యాగాలు తప్పవు. ఉత్తర్ ప్రదేశ్‌లో అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి బలం ఉంది. అక్కడ ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఆప్, బెంగాల్‌లో తృణమూల్‌కు, బీహార్‌లో జేడీయూ-, ఆర్జేడీకి మద్దతివ్వాలి’’ అని మమత చెప్పారు.
అలాగని పూర్తిగా కాంగ్రెస్ పార్టీని పోటీ చేయొద్దని తాను చెప్పడం లేదని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సీటు షేరింగ్ ఫార్ములాను అనుసరించాల్సి ఉందన్నారు. ఓ వైపు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల ఐక్యతకు నీతీశ్, తేజస్వీ యాదవ్ కృషి చేస్తున్న వేళ మమతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండబోదని గతంలో చెప్పిన మమత.. ఇప్పుడు కర్ణాటక ఫలితాల అనంతరం తన వైఖరిని మార్చుకున్నారని తెలుస్తోంది.