బెంగాల్ గడ్డపై ‘ఈడీ’ వేడి

బెంగాల్ గడ్డపై ‘ఈడీ’ వేడి

మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 3 స్థాయి కలిగిన నాయకుడిగా పేరొందిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీపై ఈడీ కొరడా ఝుళిపించింది.  ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈనెల 23న (శనివారం) ఆయనను ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు రోజున (శుక్రవారం) ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన డబ్బుల్లో మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. సీజ్ చేసిన క్యాష్ లో దాదాపు రూ.50 లక్షల విదేశీ కరెన్సీ కూడా ఉంది.  ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీనటి అర్పితా ముఖర్జీ అరెస్టుతో బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ క్యాంప్ లో మొదలైన రాజకీయ ప్రకంపనలు మంత్రి పార్థా ఛటర్జీ , ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్య  అరెస్టుతో తీవ్రమయ్యాయి.

ఏమిటీ కుంభకోణం ? 

పార్థా ఛటర్జీ  2014 నుంచి -2021 వరకు బెంగాల్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఈ వ్యవధిలో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఆయన  కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు నమోదుచేసింది. తొలుత 2014 సంవత్సరంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఆలస్యంగా 2016 సంవత్సరంలో జరిగింది. ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో, మెరిట్ జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయంటూ ఎంతోమంది అభ్యర్థులు అప్పట్లో కోల్ కతా హైకోర్టు తలుపు తట్టారు. మార్కులు తక్కువగా వచ్చిన అభ్యర్థులకు కూడా భారీ ర్యాంకులు ఇచ్చారని..  మెరిట్ లిస్టులో కనీసం పేరు లేని వాళ్లకూ ఉపాధ్యాయ పోస్టింగ్స్ ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు.  ఇక 2016 సంవత్సరంలో బెంగాల్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 13,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ భర్తీ ప్రక్రియను చేపట్టే ఉపాధ్యాయ నియామక మండలి కాల పరిమితి 2019 సంవత్సరంతో ముగిసింది.  ఉపాధ్యాయ నియామక మండలి కాల పరిమితి ముగిశాక.. నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందికి ఉపాధ్యాయ పోస్టింగ్స్ ఇచ్చారని ఇంకొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈవిధంగా అక్రమంగా పోస్టింగ్స్ కేటాయించే క్రమంలో కుంభకోణం జరిగిందని, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఈడీ చెబుతోంది. ఈ అంశానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనూ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ ప్రశ్నించింది. 2002 మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసింది. 

ఖరీదైన ఫ్లాట్ల లెక్క తీస్తున్న ఈడీ

కోల్ కతాలో మంత్రి పార్థా ఛటర్జీకి మూడు ఖ‌రీదైన ఫ్లాట్లు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. వీటిలో ఒక‌టి పూర్తి ఎయిర్‌ కండీష‌న్డ్ ఫ్లాట్.  ఆయన ఓ ఫ్లాట్‌ను అర్పిత ముఖ‌ర్జీకి గిఫ్ట్‌గా ఇచ్చార‌ని వెల్లడైంది. శాంతినికేత‌న్‌, బోల్పూర్‌లలో పార్థా ఛటర్జీ, అర్పిత ముఖ‌ర్జీల‌కు జాయింట్‌గా ఓ ఫ్లాట్ ఉంద‌ని గుర్తించారు. ఇక శాంతినికేత‌న్ ప్రాంతంలో పార్థా ఛటర్జీకి చెందిన‌విగా భావిస్తున్న మురో ఏడు ఇండ్లు, ఆపార్ట్‌మెంట్లపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు

మూడుసార్లు కాల్ చేసినా దీదీ స్పందించలేదు ?

కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం (జులై 22న) ఉదయం నుంచి 26 గంటల పాటు పార్థా ఛటర్జీని ఆయన నివాసంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని తెలపడంతో ఆయన్ను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బయటికి వచ్చే క్రమంలో.. ‘‘మీరు మమతా బెనర్జీని ఫోన్ లో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా?’’ అని విలేకరులు అడిగారు. పార్థా ఛటర్జీ దీనికి బదులిస్తూ.. ‘‘అరెస్టయిన తర్వాత నేను మూడుసార్లు మమతకు ఫోన్‌చేసినా తీయలేదు’’ అని తేల్చి చెప్పారు.తనను కస్టడీలోకి తీసుకున్న విషయాన్ని తెలియజేసేందుకు మమతకు  ఫోన్‌ చేసినట్లు పార్థా ఛటర్జీ అరెస్ట్ మెమోలో ప్రస్తావించారు. ‘శనివారం అర్ధరాత్రి 1.55 గంటల సమయంలో అరెస్టయిన తర్వాత..  తెల్లవారుజామున 2.33 గంటలకు ఛటర్జీ నుంచి మమతా బెనర్జీకి ఫోన్ వెళ్లింది. అయితే అటువైపు నుంచి సమాధానం రాలేదు. మళ్లీ 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు మరోసారి ఫోన్‌ చేసినా.. ఉపయోగం లేకపోయింది’ అని ఆ అధికారిక దస్త్రాల్లో పేర్కొన్నారు. తమ అరెస్టు గురించి నిందితులు బంధువులు లేక స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దానిలో భాగంగానే ఈ ఫోన్‌కాల్స్‌ వెళ్లాయని తెలిపాయి. అయితే, ఈ వార్తలను తృణమూల్‌ కాంగ్రెస్ తోసిపుచ్చింది. అరెస్టయిన మంత్రి ఫోన్‌ ఈడీ అధికారుల వద్ద ఉన్నందున ఆయన ఫోన్‌ చేసే అవకాశమే లేదని ఖండించాయి.