T20 World Cup 2024: ఆస్ట్రేలియన్లను వణికించిన పూరన్.. 25 బంతుల్లో 75 పరుగులు

T20 World Cup 2024: ఆస్ట్రేలియన్లను వణికించిన పూరన్.. 25 బంతుల్లో 75 పరుగులు

రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ మరోసారి టైటిల్ కొట్టేలా కనిపిస్తోంది. బంతిని అలవోకగా స్టాండ్స్‌లోకి పంపే కరేబియన్ వీరులను కట్టడి చేయడం ప్రత్యర్థి జట్లకు అంత సులువైన పనిలా కనిపించడం లేదు. సొంతగడ్డపై ఆడుతుండటం వారిలో మరింత ఉత్సహాన్ని నింపుతోంది. ఒకరుపోతే.. మరొకరు అన్నట్లు ఆ జట్టులో ఏడెనిమిదిగురు హిట్టర్లు ఉన్నారు. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ మొదలు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చే షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వరకూ అందరూ మ్యాచ్ విన్నర్లే. ఒకేసారి వీరందరూ బ్యాట్ ఝుళిపించి ఆస్ట్రేలియన్లను భయపెట్టారు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 4 వికెట్ల న‌ష్టానికి 257 పరుగులు చేసింది. కీపర్/బ్యాటర్ నికోలస్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 5 0ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేశాడు. అతను కొట్టే సిక్సర్లు స్టాండ్స్‌లోకి వెళ్తుంటే..  ఆస్ట్రేలియన్ ఫీల్డర్లు కళ్లప్పగించి చూస్తుండిపోయారు. అతనికి తోడు కెప్టెన్ పావెల్ (52), చార్లెస్(40), రూథ‌ర్‌ఫోర్డ్(47) రాణించడంతో సహ-ఆతిథ్య జట్టు భారీ స్కోరు చేసింది.

కోచ్, అసిస్టెంట్ కోచ్‌తో ఆస్ట్రేలియా

ఛేదనలో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్లు కోల్పోయి 222 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాట‌ర్లలో జోష్ ఇంగ్లిస్ 55, నాథ‌న్ ఎల్లిస్ 39 టాప్ స్కోరర్లు. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్ వంటి వారు ఇంకా ఆస్ట్రేలియా జట్టులో చేరనందున ఆసీస్ 9 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. జట్టుకు సహాయపడిన మరో ఇద్దరిలో ఒకరు.. ఆ టీమ్ హెడ్ కోచ్ కాగా, మరొకరు అసిస్టెంట్ కోచ్.

 జూన్ 1 నుంచి అసలు పోరు 

వాస్తవానికి టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. భారత కాలమానం ప్రకారం భారత్‌లో జూన్ 2న ఉదయం 6 గంటల నుంచి షురూ కానున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.