ఇంగ్లాండ్ కి షాకిచ్చిన విండీస్..ఒక్క క్యాచ్ తో తలకిందులైన మ్యాచ్

ఇంగ్లాండ్ కి షాకిచ్చిన విండీస్..ఒక్క క్యాచ్ తో తలకిందులైన మ్యాచ్

ఒక్క క్యాచ్ తో మ్యాచ్ తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని విధంగా గాలిలోకి దూకుతూ అద్భుతమైన క్యాచ్ పట్టి, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాడ్ ఓటమికి కారణమైంది.  వెస్టిండీస్‌-ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్  7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓటమి కంటే వెస్టిండీస్‌ ప్లేయర్ డియాండ్రా డాటిన్‌ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గాలిలోకి దూకుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో, నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ లారెన్‌ విన్‌ఫీల్డ్‌ కొట్టిన బాల్ ని డాటిన్ పాయింట్ మీద ఫీల్డింగ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకుంది. ఒక చేత్తో తన ఎడమవైపు గాలిలోకి ఎగురుతూ ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టుకుంది. క్యాచ్ పట్టే టైంలో ఆమె పూర్తిగా గాలిలోనే ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టు డియాండ్రా డాటిన్ (64 బంతుల్లో 31), హేలీ మాథ్యూస్ (58 బంతుల్లో 45) 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం చేసింది. తొలి బంతికే కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ ఔటైంది. షెమైన్ క్యాంప్‌బెల్ (80 బంతుల్లో 66), చెదన్ నేషన్ (74 బంతుల్లో 49) ఐదో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. వెస్టిండీస్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది.


72 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోవడంతో ఇంగ్లాండ్‌కు పేలవ ఆరంభం లభించింది. 36ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఎక్లెటన్ (33*), క్రాస్ (27) ఇంగ్లండ్ టీంను విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. అయితే, చివరి మూడు ఓవర్లలో ఇంగ్లాండ్‌కు తొమ్మిది పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. క్రాస్ రనౌట్‌గా వెనుదిరిగింది. మూడు బంతుల తర్వాత అన్య ష్రుబ్సోల్ స్పిన్నర్ అనిస్సా మహ్మద్ బౌలింగ్‌లో ఔటయింది.