IND vs WI 2nd Test: వెస్టిండీస్ అసాధారణ పోరాటానికి చెక్.. ఢిల్లీ టెస్టులో విజయం దిశగా టీమిండియా

IND vs WI 2nd Test: వెస్టిండీస్ అసాధారణ పోరాటానికి చెక్.. ఢిల్లీ టెస్టులో విజయం దిశగా టీమిండియా

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగో రోజు తొలి సెషన్ లో తడబడిన మన బౌలర్లు రెండో సెషన్ లో చెలరేగి బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ తో పాటు మిగిలినవారు సమిష్టిగా రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా ముందు కేవలం 121 పరుగుల టార్గెట్ ను మాత్రమే వెస్టిండీస్ ఉంచగలిగింది. రెండో సెషన్ లో ఇండియా ఆరు వికెట్లతో విజృంభించడం విశేషం. 115 పరుగులు చేసిన కాంప్‌బెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

3 వికెట్ల నష్టానికి 252 పరుగులతో నాలుగో రోజు రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ 66 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది. లంచ్ తర్వాత సెంచరీ చేసుకున్న హోప్ (102) ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో విండీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు తన స్పిన్ మ్యాజిక్ తో టెవిన్ ఇమ్లాచ్ (12), ఛేజ్ (40), ఖారీ పియరీ (0)లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. బుమ్రా టైలండర్ల పని పట్టాడు. వారికన్ కు బౌల్డ్ చేసిన బుమ్రా..ఇదే ఊపులో ఆండర్సన్ ఫిలిప్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో గ్రేవీస్, సీల్స్ చివరి వికెట్ కు విలువైన 79 పరుగులు జోడించి పోరాడారు. టీ విరామం తర్వాత బుమ్రా వికెట్ తీసుకొని విండీస్ ఇన్నింగ్స్ ను ముగించాడు. 

►ALSO READ | IND vs AUS: కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు వర్షం ముప్పు

రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.  కాంప్‌బెల్, హోప్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. తొలి సెషన్ లో వెస్టిండీస్ 79 పరుగులు రాబట్టి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. రెండో సెషన్ లో త్వరగా వికెట్లను కోల్పోయి 390 పరుగులకు ఆలౌటైంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 248 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసినా ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.