IND vs AUS: కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు వర్షం ముప్పు

IND vs AUS: కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు వర్షం ముప్పు

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని గ్రౌండ్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో వీరు సంపాదించుకున్న ఫాలోయింగ్ అలాంటిది. ఏ ఏడాది ప్రారంభంలో ఈ ద్వయం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించలేదు. టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా.. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు తెలిపి షాక్ కు గురి చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డేలు ఆడలేదు. ఈ మెగా టోర్నీ తర్వాత ఐపీఎల్.. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్..ఆసియా కప్ తో ఆడుతూ భారత జట్టు బిజీగా మారింది. మధ్యలో బంగ్లాదేశ్ తో జరగాల్సిన వన్డే సిరీస్ రాజకీయ వివాదం కారణంగా రద్దయింది. దాదాపు 7 నెలలు తర్వాత రోహిత్-కోహ్లీని గ్రౌండ్ లో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మెగా సిరీస్ కు వారం రోజుల సమయమే ఉంది. అక్టోబర్ 15న భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా బయలుదేరనుంది.

తొలి వన్డే ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగుతారనుకుంటే ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలనుంది. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూ వెదర్ ప్రకారం, పశ్చిమ ఆస్ట్రేలియాలో భాగమైన పెర్త్‌లో అక్టోబర్ 18 రాత్రి, అక్టోబర్ 19 ఉదయం వర్షం పడే అవకాశాలున్నాయి. మ్యాచ్ జరిగే ముందు వర్షం పడనున్నట్టు సమాచారం. అదే జరిగితే మ్యాచ్ కొన్ని గంటలు ఆలస్యం కావొచ్చు. ఒకవేళ భారీ వర్షం పడితే మాత్రమే మ్యాచ్ రద్దవుతుంది. అప్పుడు రెండో వన్డే కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

సౌతాఫ్రికా వేదికగా 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రోకో జోడీ హింట్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ కు కూడా ఈ విషయం ఊరట కలిగించేదే. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటం కష్టమని కొంతమంది మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మరికొంతమంది సూచిస్తున్నారు. 

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్: 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్