West Indies ODI squad: హెట్ మేయర్‌పై వేటు.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లకు వెస్టిండీస్ జట్టు ప్రకటన

West Indies ODI squad: హెట్ మేయర్‌పై వేటు.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లకు వెస్టిండీస్ జట్టు ప్రకటన

మే 21 నుంచి ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం (మే 6) తమ జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని విండీస్ క్రికెట్ బోర్డు ఇప్పటి నుంచే మంచి జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఈ స్క్వాడ్ లో భాగంగా ఎక్కువగా కుర్రాలకే అవకాశం కల్పించింది. షాయ్ హోప్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. 18 ఏళ్ల జ్యువెల్ ఆండ్రూ తిరిగి విండీస్ జట్టులో స్థాన సంపాదించాడు. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అమీర్ జాంగూ కూడా జట్టులోకి వచ్చాడు. ఈ స్క్వాడ్ లో ఆశ్చర్యకరంగా విండీస్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మైర్ పేరు లేదు. 

హెట్మైర్ ఇటీవలే పేలవ ఫామ్ లో ఉండడమే దీనికి కారణం. గత కొంతకాలంగా ఈ పవర్ హిట్టర్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్ ఓపెనర్లుగా రావడం ఖాయంగా మారింది. కీసీ కార్టీ మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది. హోప్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ మిడిల్, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. అల్జారి జోసెఫ్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తారు. షమర్ జోసెఫ్,  మాథ్యూ ఫోర్డ్ ఫాస్ట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. గుడాకేష్ మోటీ విండీస్ స్క్వాడ్ లో ఏకైక ఫ్రంట్‌లైన్ స్పిన్నర్.

ఐర్లాండ్ పర్యటన మే 21న ప్రారంభమవుతుంది. మే 23, 25 తేదీల్లో వరుసగా రెండు, మూడు వన్డేలు జరగనున్నాయి. మే 29 నుండి జూన్ 2 వరకు ఇంగ్లాండ్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డేలు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ వెస్టిండీస్ ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న రూథర్‌ఫోర్డ్, షెపర్డ్ త్వరలోనే విండీస్ జట్టులో చేరనున్నారు. కెప్టెన్ హోప్, జోసెఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్నారు. ఈ లీగ్ మే 18 నాటికి పూర్తవుతుంది. 

వెస్టిండీస్ వన్డే జట్టు:

షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్