కార్లోస్ అద్భుత పోరాటం వృథా : ఉత్కంఠ పోరులో కివీస్ విక్టరీ

కార్లోస్ అద్భుత పోరాటం వృథా : ఉత్కంఠ పోరులో కివీస్ విక్టరీ

మాంచెస్టర్‌: వరల్డ్ కప్ లో అసలైన కిక్కి ఇప్పుడు మొదలైంది. శనివారం జరిగిన రెండు మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు మంచి ధ్రిల్లింగ్ ఇచ్చాయి. ఉత్కంఠ పోరులో అఫ్ఘాన్ పై భారత్ గెలువగా..రెండో మ్యాచ్ లో విండీస్ పై కివీస్ చివరివరకు పోరాడి గెలిచింది. విండీస్ ఆల్ రౌండర్ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ మరోసారి రెచ్చిపోయాడు. బ్రాత్‌వైట్‌ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ..విక్టరీ మాత్రం కివీస్ నే వరించింది.

164/7.. 292 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఒక దశలో చేసిన స్కోరిది. ఇంకో మూడు వికెట్లు పడటం, వెస్టిండీస్‌ కథ ముగియడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (101; 82 బాల్స్ 9×4, 5×6) అలా ఆలోచించలేదు. ఈ మ్యాచ్‌ ఓడితే ప్రపంచకప్‌లో విండీస్‌ సెమీస్‌ అవకాశాలకు తెరపడుతుందని తెలిసి అతను మొండిగా పోరాడాడు. ఏ స్థితిలోనూ ఆశలు కోల్పోకుండా కివీస్‌ బౌలర్లను అద్భుత రీతిలో ఎదుర్కొన్నాడు. విండీస్‌ను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. కానీ విజయానికి 7 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి ఉండగా.. అతను సిక్సర్‌ కోసం ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌లో బౌల్ట్‌ పట్టిన క్యాచ్‌తో బ్రాత్‌వైట్‌తో పాటు విండీస్‌ కథ ముగిసింది. ఆ జట్టు ఆలౌటైంది. 5 పరుగుల తేడాతో కివీస్‌ గెలిచింది.

మొదట కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (148; 154 బంతుల్లో 14×4, 1×6) వరుసగా రెండో సెంచరీ సాధించడంతో కివీస్‌ 291 పరుగులు (8 వికెట్లకు) చేసింది. అనంతరం విండీస్‌ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్‌తో పాటు క్రిస్‌ గేల్‌ (87; 84 బంతుల్లో 8×4, 6×6), హెట్‌మెయర్‌ (54; 45 బంతుల్లో 8×4, 1×6)ల పోరాటం కూడా వృథా అయింది. 6 మ్యాచ్‌లాడిన కివీస్‌కిది ఐదో గెలుపు. భారత్‌తో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది. ఆ జట్టు దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. 6 మ్యాచ్‌లాడిన విండీస్‌కిది నాలుగు ఓటమి. ఒకటే నెగ్గింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ ఓటమితో కరీబియన్‌ జట్టు సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి.

ఆశలే లేని స్థితి నుంచి..: విండీస్‌ ఛేదన పేలవంగా ఆరంభమైంది. హోప్‌ (1), పూరన్‌ (1)లను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసిన బౌల్ట్‌.. ఇన్నింగ్స్‌ ఆరంభంలో విండీస్‌ను గట్టి దెబ్బే తీశాడు. అయితే గేల్‌కు హెట్‌మెయర్‌ తోడవడంతో విండీస్‌ పోటీలోకి వచ్చింది. గేల్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా.. ఆ తర్వాత చెలరేగి ఆడాడు. భారీ షాట్లతో కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక దశలో 142/2తో విండీస్‌ మంచి స్థితికి చేరుకుంది. అయితే 10 పరుగుల వ్యవధిలో హెట్‌మయర్‌, హోల్డర్‌ (0), గేల్‌ వెనుదిరగడంతో మ్యాచ్‌ కివీస్‌ వైపు మళ్లింది. పతనం కొనసాగడంతో 164/7తో విండీస్‌ కుప్పకూలేలా కనిపించింది. కానీ రోచ్‌ (14), కాట్రెల్‌ (15), థామస్‌ (0 నాటౌట్‌)ల అండతో అసాధారణ రీతిలో పోరాడిన బ్రాత్‌వైట్‌ విండీస్‌ను విజయం దిశగా నడిపించాడు. 245 స్కోరు వద్దే 9వ వికెట్‌ పడినా.. అతను పోరాటం ఆపలేదు. తనే స్ట్రైకింగ్‌ తీసుకుంటూ సంచలన షాట్లు ఆడాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. సింగిల్‌ తీసి చివరి ఓవర్‌కు స్ట్రైక్‌ తీసుకోవడం కంటే సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించేయాలనుకున్నాడు బ్రాత్‌వైట్‌. కానీ నీషమ్‌ బౌలింగ్‌లో అతను భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ హద్దుల వద్ద బౌల్ట్‌ క్యాచ్‌ పట్టేయడంతో మ్యాచ్‌ ముగిసింది. న్యూజిలాండ్‌: 291 (విలియమ్సన్‌ 148, టేలర్‌ 69, నీషమ్‌ 28; కాట్రెల్‌ 4/56); వెస్టిండీస్‌: 286 (గేల్‌ 87, హెట్‌మయర్‌ 54, బ్రాత్‌వైట్‌ 101; బౌల్ట్‌ 4/30)