రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్తున్నది : మంత్రి వెంకట్‌‌‌‌రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్తున్నది : మంత్రి వెంకట్‌‌‌‌రెడ్డి
  • ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నం: మంత్రి వెంకట్‌‌‌‌రెడ్డి
  • గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలోరాష్ట్రం దివాలా తీసింది
  • కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గరవందల కోట్ల ఆస్తులున్నయ్ 
  • రాష్ట్రంలో రోడ్ల విస్తరణకుగడ్కరీ సహకరిస్తున్నరు
  • పార్టీలకతీతంగా ప్రాజెక్టులు సాంక్షన్ చేస్తున్నరని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో రాష్ట్రం దివాలా తీసిందని, వాళ్లు చేసిన అప్పులు, వడ్డీల భారం తమ ప్రభుత్వంపై పడిందన్నారు. మిగులు బడ్జెట్‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్​ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు రైతు బంధు, సన్న బియ్యం లాంటి స్కీమ్స్‌‌‌‌ను అమలు చేస్తున్నట్టు చెప్పారు. 

సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి చిట్ చాట్ చేశారు. “ కాళేశ్వరం ఆఫీసర్లను ఏసీబీ పట్టుకుంటే వందల కోట్లు దొరుకుతున్నయ్​. ముగ్గురు అధికారుల ఇండ్లలో ఏసీబీ తనిఖీలు చేస్తే.. వెయ్యి కోట్లకు పైగా  ఆస్తులు ఉన్నట్లు బయటపడింది. ఇంజినీర్ల దగ్గర ఇన్ని కోట్ల ఆస్తులు ఉంటే లీడర్లు ఎంత సంపాదించి ఉంటరు. 3 లక్షల జీతం ఉన్న అధికారి థాయిలాండ్‌‌‌‌లో పిల్లల పెళ్లి చేశారంటే ఎంత ఓపెన్ గా అవినీతి జరిగిందో అర్థమవుతున్నది.   హైదరాబాద్ తర్వాత ఉమ్మడి నల్గొండను ఎంతో అభివృద్ధి చేస్తున్నా.  ఎస్ఎల్‌‌‌‌బీసీ కోసం వైఎస్సార్‌‌‌‌‌‌‌‌తో  పోరాడిన. కేసీఆర్ కుటుంబం ఏం క్షుద్రపూజలు చేసిందో ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ కూలిపోయింది” అని వ్యాఖ్యానించారు.

 ట్రిపుల్​ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌కు కొత్తరూపు

రీజనల్ రింగ్ రోడ్‌‌‌‌ (ట్రిపుల్​ఆర్)తో హైదరాబాద్ స్వరూపం మారనున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. నార్త్ పార్ట్ భూసేకరణకు రూ.6 వేల కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు టూరిజం, సినిమా షూటింగ్స్‌‌‌‌పరంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.  రేషన్​షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో బియ్యం ధరలు తగ్గాయని చెప్పారు. 

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల  రోడ్డు విస్తరణను గత ప్రభుత్వం 2017 లో స్టార్ట్ చేస్తే ఇప్పటివరకూ పూర్తికాలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను మార్చామని, వచ్చే ఏడాది దసరా వరకు పూర్తవుతుందని తెలిపారు. పార్టీలకతీతంగా కేంద్ర మంత్రి గడ్కరీ సహకరిస్తున్నారని, రాష్ట్ర ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. చింతల్‌‌‌‌కుంట నుంచి హయత్‌‌‌‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ను గడ్కరీ మంజూరు చేశారని తెలిపారు. 

సెక్రటేరియెట్, జిల్లా కలెక్టరేట్లు కట్టామని గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నదని, కానీ.. ఈ రెండు ప్రాజెక్టుల బిల్లులు ఇవ్వకుండా తమ ప్రభుత్వంపై భారం మోపిందని మండిపడ్డారు.  ఏపీలో రాజకీయం వేరు,తెలంగాణలో  వేరని, ఏపీని చూసి తెలంగాణలో అరెస్టులు ఉంటాయని అనుకోవద్దన్నారు.  తమపైన ఇతర దేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.  తాము రాజకీయ  కక్ష సాధింపులకు  పాల్పడడం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.