Vinesh Phogat: అనర్హత వేటు.. ఫోగాట్ సహాయక సిబ్బందిపై విచారణ

Vinesh Phogat: అనర్హత వేటు.. ఫోగాట్ సహాయక సిబ్బందిపై విచారణ

రెజ్లింగ్ విభాగంలో భారత్ కు పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఆమె 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. ఈ అంశం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. యావత్ దేశమంతటా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫోగాట్ అనూహ్యంగా బరువు పెరగడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వినేశ్ ఫొగాట్‌ సహాయక సిబ్బందిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్ విచారణ ప్రారంభించారు. 

గంటల వ్యవధిలో 2 కిలోల బరువు

వాస్తవానికి వినేశ్ ఫొగాట్‌ తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు.. అనగా, మంగళవారం(ఆగష్టు 06) ఉదయం నిర్వహించిన పరీక్షలో 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నారు. మరుసటి రోజు అనగా బుధవారం(ఆగష్టు 07) పరీక్షలో ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నప్పటికీ, మొత్తం ఆమె పెరిగిన బరువు మాత్రం దాదాపు 2 కేజీలుగా ఉంది. ఈ పెరుగుదలే ఎవరికి అంతుపట్టడంలేదు. గంటల వ్యవధిలో ఆమె 2 కేజీల బరువు ఎలా పెరిగిందనేది అనుమానించదగ్గ విషయం.

మ్యాచ్ మధ్యలో తిన్న తిండే.. 

ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోవాలి. మంగళవారం ఉదయం బరువు పరీక్ష జరిగిన తరువాత ఆమె మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడింది. అంటే, అందుకోసం ఆమె కొంత శక్తిని వెచ్చించింది. ఈ సమయంలో ఆమె బరువు పెరిగే అవకాశమే లేదు. అయితే, మ్యాచ్‌ల మధ్య వచ్చిన గ్యాప్‌లో తీసుకున్న ఆహారం కారణంగానే ఆమె బరువు పెరిగి ఉండాలి. అథ్లెట్ కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? బరువు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనేది కోచ్, సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. వారు పట్టించుకోకపోవడంతోనే ఆమె బరువు పెరిగిందనేది తెరమీదకొస్తున్న వాదన. 

ఫోగాట్ తప్పు లేదు..

బరువు పెరుగుదల వెనుక వినేశ్ ఫోగాట్ తప్పు లేదని WFI అధ్యక్షుడు సంజయ్ సింగ్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నొక్కిచెప్పారు. కోచ్ వోలర్ అకోస్, ఫిజియో అశ్విని జివాన్ పాటిల్‌ సహా ఆమె సహాయక సిబ్బంది బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఆమె బరువుపై అనేక ప్రశ్నలు

వినేశ్ ఫోగాట్ సాధారణ బరువు 57 కిలోలు, కానీ ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఆమె సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు 49.9 కిలోల వద్ద ప్రమాదకర స్థాయిలో ఉంది. మ్యాచ్ తర్వాత ఆమె బరువు 52.7 కిలోలకు పెరిగింది. ఎంతో శ్రమించి 2.6 కిలోల బరువును కోల్పోయినప్పటికీ, 100 గ్రాముల అధిక బరువు తేడాతో ఆమె పతకాన్ని చేజార్చుకుంది.

టీమిండియా డాక్టర్ ఏం చెప్పారు..?

వినేశ్ బరువు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు భారత కాంటెంజెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా ధృవీకరించారు. బుధవారం ఉదయం ఆమె జుట్టును కూడా కత్తిరించినట్లు ఆయన వెల్లడించారు. అయితే, మూడు బౌట్‌లు ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించడానికి, కొంత మొత్తంలో నీరు ఇవ్వాల్సి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆమె బరువు పెరుగుదలకు అదే  కరమైనట్లు తాము కనుగొన్నామని పేర్కొన్నారు.