మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేంటి?..అమిత్ షాను ప్రశ్నించినపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేంటి?..అమిత్ షాను ప్రశ్నించినపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 
  • ఎల్బీ స్టేడియంలోఖర్గే సభ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: ఆపరేషన్​ కగార్​ను కేంద్రం నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేంటని కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు. మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదంటూ ఆదివారం నిజామాబాద్​లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే ప్రధాని మోదీ,  అమిత్ షా లాలూచీపడి పాక్ తో యుద్ధం ఆపేశారని.. అలాంటప్పుడు మన పౌరులే మావోయిస్టు ఉద్యమం నడుపుతున్నందున కాల్పుల విరమణ చేసి, వారితో చర్చలు జరిపితే తప్పేముందని మహేశ్​గౌడ్​ ప్రశ్నించారు.

జులై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ఫాసిస్టు విధానాలను జనంలో ఎండగట్టేందుకే  హైదరాబాద్ సభకు ఖర్గే వస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాజ్యంగ పరిరక్షణ కోసం ఆయన అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్నారు” అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గ్రామ, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మొత్తంగా 25 వేల మంది ఈ సభకు వస్తారని తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించినవారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.