
- బీజేపీలో అందరికీ ఒకటే గ్రూప్: బండి సంజయ్
- కాంగ్రెస్ విధానాలపైపోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కాం సహా అనేక అక్రమాలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి జైల్లో వేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో వేసేవాళ్లమని అన్నారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎన్.రామచందర్‌రావు ఎన్నిక సందర్భంగా మన్నెగూడలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ కార్యకర్తలందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో వంద సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ఏ గ్రూపులు ఉండవని, అందరిదీ ఒకటే గ్రూప్ అని, టీం కెప్టెన్ మోదీ అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని కార్యకర్తలను కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో కాషాయ జెండాను ఎగరేద్దామని పిలుపునిచ్చారు
రామచందర్‌రావు ఓ మిసైల్
రామచందర్‌రావు ఒక మిసైల్అని బండి సంజయ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ లీడర్‌గా, బీజేపీలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు అని కొనియాడారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారని ఫైర్అయ్యారు. అధ్యక్ష పదవిని ఎవరైనా ఆశించవచ్చని, అయితే హైకమాండ్ నిర్ణయాన్ని తప్పకుండా పాటించాల్సిందేనన్నారు. దేశానికి బీసీని ప్రధాన మంత్రిని చేసిన ఘనత బీజేపీకే ఉందని, ఆ దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. దళిత, ఆదివాసీ బిడ్డలను రాష్ట్రపతులుగా చేసిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుందన్నారు.
తనతో పాటు లక్ష్మణ్, దత్తాత్రేయ, చలపతిరావు వంటి బీసీలను పార్టీ అధ్యక్షులుగా చేసింది బీజేపీయేనని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేయకుంటే తల నరక్కుంటానని చెప్పిన కేసీఆర్.. మాట మార్చి దళితులను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. తమకు సమాన ప్రత్యర్థులేనన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపితే బీఆర్ఎస్, కాంగ్రెస్ బండారం బయటపడుతుందేమోనని రేవంత్ భయపడుతున్నారన్నారు.