
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. నిజాలను నిర్భయంగా వెల్లడించే పత్రికా స్వాతంత్ర్యానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ఆరంభకాలం నుంచే మొదలయ్యాయి. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కేందుకు అరాచక శక్తులు సర్వత్రా ప్రయత్నిస్తున్నాయి.
ఇయ్యాల ప్రెస్, ఎలక్ర్టానిక్ మీడియాపై అలాంటి దాడులు చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రపంచ దేశాలలో అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా భారతదేశంలోనే ఉన్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర వార్తా సేకరణలో జర్నలిస్టులు ప్రతిరోజు పని ఒత్తిడికి గురవుతున్నారు. వృత్తిపరమైన ఇబ్బందులేకాక అనేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం. మీడియా హౌజ్ లపై నిత్యం దాడులు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా విలేకరులపై ఆయా ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదైన సందర్భాలు కూడా మనం గుర్తుచేసుకోవాలి. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీ లంకేశ్ హత్య ఘటన, పత్రికా స్వేచ్ఛ గురించి డబ్బా వాయించేవారిని తమ పగటి కలల నుంచి బయటపడేసింది. ఇలాంటి ఘటనలు దేశంలో ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి.
లంకేశ్ హత్య తర్వాత బిహార్ లోని అర్వాల్ జిల్లాలో రాష్ట్రీయ సహారా విలేకరి పంకజ్ మిశ్రాను బైక్ మీద వచ్చిన ఇద్దరు హంతకులు కాల్చి చంపేశారు. గత దశాబ్ద కాలంలో జర్నలిస్టులపై దాడులు, హత్యలు చేసినా నిందితులకు ఎలాంటి కఠిన శిక్ష పడకపోవడం కూడా దాడులు పెరగడానికి ఒక కారణమైంది. ఈక్రమంలో ప్రపంచదేశాల్లో హైతీ, ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇదేతంతు ప్రపంచవ్యాప్తంగా 80శాతం నిరంతరాయంగా కొనసాగుతోంది. 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ 116వ స్థానంలో ఉంది. కాగా, 2019లో 141వ ర్యాంక్ నుంచి ఊహించని పురోగతి సాధించడం గమనార్హం.
పత్రికా స్వాతంత్ర్యానికి ప్రమాదం
పత్రికా స్వాతంత్ర్యానికి ప్రమాదం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా మీడియాపై బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమైపోయాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలోనే బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కన్నింగ్ గ్యాంగింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ముద్రణా సంస్థల ఏర్పాటు, అవి ఏం ముద్రిస్తున్నాయి. సంబంధిత లైసెన్సులు వంటి వాటిని ప్రభుత్వమే ఈ చట్టం ప్రాతిపదికన క్రమబద్ధీకరిస్తూ వచ్చింది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా ఏమి ప్రచురించినా దానిని ప్రభుత్వ ఉల్లంఘనగా పరిగణించేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినప్పుడు ప్రెస్ యాక్ట్ 1878ని తీసుకొచ్చి అమర్ బజార్ పత్రికతో సహా 35 స్థానిక పత్రికలపై చర్యలు తీసుకున్నారు. వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు బాల గంగాధర్ తిలక్ ను సైతం రెండుసార్లు జైల్లో పెట్టారు. ఈరోజు
ప్రెస్పై అలాంటి దాడులు కేవలం చిన్న, చిన్న పట్టణాలకే పరిమితం కాకుండా పటిష్టమైన భద్రత ఉండే నగరాలకు కూడా విస్తరించడం జరుగుతోంది. ప్రాంతీయ పత్రికలు, టీవీ చానల్స్, ఫ్రీలాన్స్ ప్రాతిపదికన పనిచేస్తున్న విలేకరులు చాలావరకు బాధితులుగా మిగులుతున్నారు.
విలేకరులకు రక్షణ కరువు
మీడియా కార్యాలయాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులకు రక్షణ లేకుండా పోయింది. నాడు బాడుగ నేతలు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. 2014లో ఒడిశాలోని బాలకార్మికులపై వార్త రాసిన తరుణ్ ఆచార్యను కత్తులతో పొడిచారు. అదే సంవత్సరం ఒక పాత్రికేయురాలిపై సామూహిక అత్యాచారం, అర్ధరాత్రి అరెస్టులు, మీడియా కార్యాలయాల ధ్వంసం పరిపాటి అయ్యింది.
సైద్ధాంతికంగా పత్రికా స్వేచ్ఛ అనేది అవధులు లేని పరిపూర్ణ భావన. కానీ, ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థ పత్రికా స్వేచ్ఛపై గణనీయమైన ఆంక్షలు విధిస్తోంది. రాజ్యాంగంలోని అధికరణ 19A (1) భావప్రకటన స్వేచ్ఛ పుణ్యమా అని ఇతరుల హక్కులను హననం చేయడం జరుగుతోంది. తమపై వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్టులపై రాజకీయ నేతలు, సెలబ్రిటీలు పరువునష్టం కేసులు వేయడం సహజమైపోయింది.
1991–-96 కాలంలో జయలలిత ప్రభుత్వం ఒక్క తమిళనాడులోనే 120 పరువు నష్టం కేసులు పెట్టింది. మీడియా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేసే పనిలో నిమగ్నమైందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అది విద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించడం జరుగుతోంది.
చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు
మీడియా ఏదైనా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తే, అది ఎవరికైనా పరువునష్టం కలిగిస్తే అటువంటి వ్యక్తి, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. చట్టపరమైన రక్షణ పరిమితం కావడంతో పత్రికా స్వేచ్ఛ గణనీయమైన స్థాయిలో ఆంక్షలకు గురవుతోంది. ఆన్ లైన్ దాడులు, లీగల్ నోటీసులు , సెక్షన్ 124 (ఎ) కింద జైలుకు పంపే ప్రమాదం వంటి వాటితో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతోంది. పేదవాడి గొంతుకై .. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడే మీడియాపై దాడులు తీవ్రం కావడం పత్రికా స్వేచ్ఛకు భంగం కల్గించడమే.
ఇటీవల పత్రికాస్వేచ్ఛపై జరిగిన దాడులు అరాచకానికి పరాకాష్ట. టీఆర్పీ కోసం పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే ప్రజలే క్షమించరని గుర్తించాలి. మీడియా కార్యాలయాలపై, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నందున బార్ కౌన్సిల్లాగే భారత పత్రికా మండలి కూడా జర్నలిస్టుల స్థాయిని పెంచేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా లంచం తీసుకున్న ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వృత్తి వ్యతిరేక ప్రవర్తనను కొనసాగించి, విలువలకు తిలోదకాలు ఇచ్చే జర్నలిస్టులను కలానికి, గళానికి దూరంగా పెట్టే చట్టాలు కూడా తీసుకురావాలి.
- - డా. సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ యూనివర్సిటీ