
దాదాపు 350 ఏండ్ల క్రితమే కుల, మత, జాతివర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన బహుజన పోరాట యోధుడు, గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆధిపత్య అగ్రకుల పాలకులు బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలో స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు, మహాత్మా జ్యోతిబా ఫూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.
రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జమీందార్లు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న.
స ర్దార్ సర్వాయి పాపన్న క్రీ.శ. 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ కులంలో జన్మించాడు. పాపన్న తండ్రి ఆయన చిన్నతనంలోనే చనిపోతే తల్లి సర్వమ్మ అన్నీ తానై గారాబంగా పెంచింది. పాపన్న కల్లుగీత వృత్తి కొనసాగిస్తూ యుక్తవయసులోనే భూస్వాముల, దేశముఖ్‌ల నిరంకుశత్వాన్ని, దాష్టీకాలను సహించలేక, మూఢ సంప్రదాయాలనీ, కట్టుబాట్లని ఎదిరించి పోరుబాట పట్టాడు. అయితే, అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని, మొత్తం బహుజన కులాలను ఏకం చేయాలనుకున్నాడు.
తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్లతో కలిసి పాపన్న చుట్టూ జరుగుతున్న విషయాల గురించి గంటల తరబడి చర్చించేవాడు. వాళ్లకి తన మార్గం, భవిష్యత్తు కార్యాచరణని వివరించి గెరిల్లా సైన్యాన్ని తయారు
చేసుకున్నాడు. ధనవంతులు, జమీందారులపై రహస్య దాడులు చేసి కొల్లగొట్టిన ధనంతో మెరుగైన ఆయుధాలను సమకూర్చుకున్నాడు.
దొరల బాధితులకు విముక్తి కలిగించి తన సైన్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలోని వివిధప్రాంతాల్లో అగ్రకుల భూస్వాములు, ధనవంతుల గడీలపై, కోటలపై దాడి చేస్తూ, ఆ గడీలను కోటలను స్వాధీనపర్చుకుని, కోటలలో దాచుకున్న దోపిడీ ఆస్తులని కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టి, బందీలుగా మగ్గుతున్న అణగారిన వర్గాల ప్రజలను విడిపించాడు.
ఖిలాషాపూర్ రాజధానిగా..
కొంతమంది స్నేహితులతో ప్రారంభమైన పాపన్న సైన్యం అతి తక్కువ సమయంలోనే 12 వేలకు చేరుకుంది. సైనిక శిక్షణ, యుద్ధవిద్యలను నేర్చుకోవడానికి సైతం పాపన్న వ్యూహాత్మకంగా అడుగులువేశాడు. శిక్షణ పొందిన సైన్యం ద్వారా చిన్నచిన్న సంస్థానాలు, గడీలపై మెరుపుదాడులతో వాటిని ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించుకుని అక్కడ శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నాడు.
పాపన్న ఆ తరువాత కరీంనగర్, హుస్నాబాద్, ఎలగందుల, రాజ్యాలను జయించినట్లు తెలుస్తుంది. ఇలా రాజ్య విస్తరణ చేసుకుంటూ, తాటికొండలో నిర్మించిన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను ఉధృతం చేసి వరంగల్, నల్గొండ జిల్లాల్లోని రాజ్యాలను గెలిచాడు. ఎత్తైన గుట్టలు వున్న ప్రాంతాలనే రక్షణ దుర్గాలుగా ఎంచుకుని కనుచూపు మేరలో శత్రువు కదలికలను కనిపెట్టేవిధంగా కోటల నిర్మాణం చేశాడని, ఆధునిక ఆయుధాలు సైతం వాడినట్లు ఆ కోటల పైభాగాన ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది. పాపన్న పరాక్రమంలోనే కాకుండా రాజనీతిలో ఏ చక్రవర్తికీ తీసిపోడు. స్వయంసమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. తాటికొండ లాంటి ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి చెక్ డ్యామ్లని కట్టించాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు.
వశమైన అనేక ప్రాంతాలు
1708లో మొఘల్ ఏలుబడిలో ఉన్న గోల్కొండ రాజ్యంలో 2వ సంపన్నవంతమైన నగరం వరంగల్‌పై 3 వేల మంది సైన్యంతో దాడి చేశారు. ఇక్కడ దోచిన సొమ్ముతో ‘డచ్ ఆంగ్ల వర్తకుల’ నుంచి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేశాడు. 1708లో ఔరంగజేబు మరణం తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గోల్కొండ రాజ్యంలో సర్వాయి పాపన్న మరింత విజృంభించి భువనగిరి కోటతో సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
కొలనుపాక, జఫర్ ఘడ్, చేర్యాల్, బైరానుపల్లి, నల్గొండ, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ మొదలు మెదక్ జిల్లా పాపన్న పేట వరకు ఉన్న ప్రాంతాలని తన సామ్రాజ్యంగా చేసుకుని పాలించాడు. ఇలా సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి తన అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో 20 కోటలని నిర్మించాడు.
కలవరపడ్డ ఔరంగజేబు
1700 - 1705 మధ్యకాలంలో ఖిలాషాపుర్లో మరొక దుర్గం నిర్మించాడు. యుద్ధవిద్యలలో ఆరితేరిన సైన్యాన్ని సమకూర్చుకున్న పాపన్న ఖిలాషాపుర్ కేంద్రంగా రాజ్యపాలన చేస్తుండటంతో.. ఈ ప్రాంతాల నుంచి రావలసిన పన్నుల వసూలు తగ్గిపోవడంతోపాటు, రాజ్యాలు ఒక్కొక్కటి చేజారుతుండటం ఆప్పటి ఢిల్లీ సుల్తాన్ ‘ఔరంగజేబు’కు కలవరం కలిగించింది.
పాపన్నను బంధించాలని అప్పటి కొలనుపాక పాలకుడు ‘రుస్తుందిల్ ఖాన్’ను ఔరంగజేబు ఆదేశించడంతో, తన సైన్యాధినేత ‘ఖాసిం ఖాన్’ను పాపన్నపై దాడికి పంపించాడు. ఖిలాషాపుర్పై దాడికి వచ్చిన ఖాసింఖాన్‌ను హతమార్చి అతడి సైన్యాలను పాపన్న తిప్పికొట్టాడు. కొంతకాలం తరువాత ఏకంగా రుస్తుందిల్ ఖాన్ రంగంలోకి దిగి, పాపన్న సైన్యానికి పెద్ద ఎత్తున నష్టం చేసి, ఖిలాషాపుర్ కోటను నేలమట్టం చేశాడు, అనంతర కాలంలో తిరిగి పాపన్న ఖిలాషాపుర్ కోటను మరింత శత్రు
దుర్భేద్యంగా నిర్మించుకున్నాడు.
గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన పాపన్న
ఔరంగజేబు మరణం తర్వాత బహుదూర్ షా మొఘల్ చక్రవర్తి అయ్యాడు. అయితే, దక్షిణాన మొఘల్ పాలన పట్టు తప్పడంతో పాపన్న గోల్కొండ కోటపైకి దాడికి పథకం పన్నడం, అది తెల్సుకున్న మొఘల్ రాజు ‘బహదూర్ షా’ పాపన్నను స్వయం పాలకునిగా తెలుసుకుని గోల్కొండకు సంధికి ఆహ్వానించాడు. సంధికి వచ్చిన పాపన్నను ‘ఎర్ర తివాచీ’ పరచి గౌరవంగా ఆదరించారని ఆంగ్లేయ చరిత్రకారుడు ‘టిడబ్ల్యూ హేగ్’ తన రచనల్లో పేర్కొన్నారు. కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా చేసిన ప్రతిపాదనకు అంగీకరించిన పాపన్న కప్పాన్ని చెల్లించి గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడు.
దేశ్‌ముఖ్‌ల కుట్రలు
మొఘల్ చక్రవర్తి ‘బహదూర్ షా’ బహుజనుడైన పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా చేయడాన్ని జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు జీర్ణించుకోలేకపోయారు. పాపన్నను ఎలాగైనా రాజ్యాధికారం నుంచి తప్పించాలని కుట్రలు పన్నారు. తెలంగాణలో మొఘల్ చక్రవర్తుల రాజ్య విస్తరణను అడ్డుకుని 30 ఏండ్లు తెలంగాణ గడ్డని పాలించిన పాపన్న విజయాలకు బెదిరిపోయిన సుబేదార్లు, భూస్వాములు కుట్రలు పన్ని పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని ‘బహదూర్ షా’ని వేడుకోవడంతో ఆయన పాపన్నను బంధించి తేవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు.
దీంతో ‘యూసఫ్ ఖాన్ రుజ్బహాని’ నాయకత్వంలో పెద్ద ఎత్తున మొఘల్ సైన్యం పాపన్న పై మూకుమ్మడిగా దాడికి దిగగా ఇరు సైన్యాల మధ్య జరిగిన భీకర పోరులో పాపన్న తీవ్రంగా గాయపడి తప్పించుకున్నాడు. తప్పించుకున్న పాపన్న తనకు సురక్షిత ప్రాంతంగా భావించి హుస్నాబాద్ ప్రాంతానికి చేరుకుని అక్కడ రహస్యంగా కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తూనే ఎల్లమ్మ గుడిని కట్టించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఒక విద్రోహి అందించిన సమాచారంతో మొఘల్ సైన్యం ఆయనను గుర్తించి బంధించడానికి ప్రయత్నించగా, శత్రువు చేతిలో మరణించడం ఇష్టం లేక పాపన్న తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజల్లో ఒక కథనం ఉంది.
మరో కథనం ప్రకారం 1709లో ఇరు సైన్యాల మధ్య జరిగిన పోరులో మొఘల్ సైన్యం ఆయనను బంధించి పాపన్న తలను ‘బహధూర్ షా’కు కానుకగా ఢిల్లీకి పంపి, పాపన్న మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారని మరో కథనం కూడా ప్రచారంలో వుంది. ఇలా వివిధ కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్యస్థాపనకు నడుం కట్టిన ఒక యోధుడి విజయగాథను చరిత్ర మరిచింది. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడికి దక్కాల్సిన కీర్తి దక్కలేదు. సామాన్యుడు కావడం వల్లే అతడి ప్రతిభ కాలగర్భంలో కలిసిపోయింది. అతడే వరంగల్ జిల్లా ఖిలాషాపుర్లో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కాకతీయుల పాలన అంతమైన సుమారు 300 సంవత్సరాల తర్వాత క్రీ.శ. 1650 నుంచి 1709 వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది.
ఖిలాషాపుర్ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనుడు. ఒక సామాన్యుడు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుని రాజ్యాధినేతలనే ఎదిరించిన ఘనత, గోల్కొండ కోటపై విజయబావుటా ఎగురవేసిన కీర్తిని చరిత్ర పుటల్లో లిఖించడానికి మనవారికి చేతులు రాలేదు. అతని కీర్తికి సజీవ సాక్ష్యంగా ఉన్న కోటలు, బురుజులు శిథిలమైపోతున్నా వాటిని రక్షించే చర్యలేవీ లేవు. ఫూలే కంటే ముందు సామాజిక న్యాయం అమలు చేసిన పాపన్నకు సరైన గుర్తింపు రాలేదు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారు. రాచరికపు ప్రభువుల వైభవాన్ని తప్ప సామాన్యుడి పోరాటాన్ని చరిత్ర విస్మరిస్తుందనడానికి సర్వాయి పాపన్న చరిత్రే సజీవ సాక్ష్యం.
-డా. పొన్నం రవిచంద్ర, సీనియర్ జర్నలిస్ట్-