
భారత పార్లమెంట్ ఆగస్టు 13, 2025న ఆదాయపు పన్ను (నెం.2) బిల్లు 2025ను ఆమోదించింది. 1961 చట్టాన్ని భర్తీచేసే ఈ బిల్లు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. సరళీకరణ, ఆధునికీకరణ, అనుకూలత లక్ష్యంగా రూపొందిన ఈ చట్టం ప్రజలు, ప్రభుత్వం, వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో లోతుగా విశ్లేషిద్దాం.
ఈ బిల్లు 819 సెక్షన్లను 536కి, 47 చాప్టర్లను 23కి తగ్గించింది. 5.12 లక్షల పదాలను 2.6 లక్షలకు కుదించి, సామాన్యులకు అర్థమయ్యే భాషను ఉపయోగించడం జరిగింది. ‘టాక్స్ ఇయర్’ భావన ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ గందరగోళాన్ని తొలగిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒకే టాక్స్ ఇయర్‌గా నిర్వచించడం రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది.
సామాన్యులకు ఈ సరళత ప్రయోజనకరం. అయితే, తక్కువ ఆర్థిక సాక్షరత ఉన్నవారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, వ్యాపారులు ఈ మార్పులను అర్థం చేసుకోవడం సవాలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను చేపట్టకపోతే ఈ సరళీకరణ పూర్తి ప్రయోజనం సాధించకపోవచ్చు.
డిజిటల్ ఆస్తులపై నిబంధనలు
ఆలస్య రిటర్న్‌లపై రిఫండ్ నిషేధాన్ని తొలగించడం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తుంది. గతంలో గడువు తర్వాత రిటర్న్ దాఖలు చేసినవారు రిఫండ్‌లను కోల్పోయేవారు. ఈ మార్పు రిఫండ్‌లను అందుబాటులోకి తెస్తుంది. జనానికి ఆర్థిక సౌలభ్యం కల్పిస్తుంది. అయితే, రిఫండ్‌ల పెరుగుదల ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తెస్తుంది.
ఈ భారాన్ని నిర్వహించేందుకు డిజిటల్ వేదికలను బలోపేతం చేయాల్సి ఉంటుంది, లేకపోతే రిఫండ్ ప్రక్రియలో ఆలస్యం ప్రజాభిమానాన్ని తగ్గిస్తుంది. డిజిటల్ ఆస్తులపై నిబంధనలు ఈ బిల్లు కీలక లక్షణం. క్రిప్టో ఆస్తులు, నాన్-ఫంజిబుల్ టోకెన్‌లపై స్పష్టమైన నిర్వచనాలు, పన్ను నిబంధనలు ప్రవేశపెట్టడం జరిగింది. సోషల్ మీడియా ఖాతాలు, క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలను తనిఖీ చేసే అధికారం పన్ను అధికారులకు ఇవ్వడమైంది.
ఇది పన్ను ఎగవేతను నియంత్రిస్తుంది, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది. ముఖ్యంగా క్రిప్టో లావాదేవీలలో. అయితే, డిజిటల్ వ్యాపారులు, స్టార్టప్‌లు అదనపు కంప్లయన్స్ ఖర్చులను ఎదుర్కొంటాయి. సోషల్ మీడియా ఖాతాల తనిఖీ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే ప్రమాదం తెస్తుంది. దీనివల్ల యువత, టెక్ వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావొచ్చు.
వ్యాపారులకు ఉపశమనం
కార్పొరేట్ పన్ను సవరణలు వ్యాపారాలకు ఉపశమనం కల్పిస్తాయి. ఇంటర్ -కార్పొరేట్ డివిడెండ్‌లపై డిడక్షన్‌లు (సెక్షన్ 80ఎం) డబుల్ టాక్సేషన్‌ను తగ్గిస్తాయి. లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లపై ఆల్టర్నేట్ మినిమం టాక్స్ సవరణలు, 12.5% లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను కొనసాగించడం చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు ప్రయోజనకరం. ఇవి వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి, ఆర్థికవృద్ధిని ప్రోత్సహిస్తాయి. అయితే, డిడక్షన్‌లు, మినహాయింపులు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయంలో తాత్కాలిక తగ్గుదల ఉండవచ్చు.
ఇది ఆర్థిక నిర్వహణలో సవాలుగా మారవచ్చు. హౌస్ ప్రాపర్టీ ఆదాయంపై 30% స్టాండర్డ్ డిడక్షన్, ప్రీ- కన్‌స్ట్రక్షన్ వడ్డీ డిడక్షన్ అద్దె ఆస్తుల యజమానులకు లాభం. అయితే, వాస్తవ రెంట్ లేదా నోషనల్ రెంట్‌లలో ఎక్కువైన దానిపై పన్ను విధించడం అద్దె ఆదాయం తక్కువ ఉన్నవారిపై భారం పెంచుతుంది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి నప్పటికీ, అద్దె ఆస్తుల యజమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. పెన్షన్ డిడక్షన్‌లు, చారిటబుల్ ట్రస్ట్‌లకు మినహాయింపులు సామాజిక సంక్షేమాన్ని పెంచుతాయి.
సామాన్యులకు సరళమైన పన్ను
ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ నుంచి కమ్యూటెడ్ పెన్షన్‌పై పూర్తి డిడక్షన్, అనామక దానాలపై 5% మినహాయింపు పెన్షనర్లకు, స్వచ్ఛంద సంస్థలకు ఊరటనిస్తాయి. ఇవి దీర్ఘకాలంలో సామాజిక భద్రతను బలోపేతం చేస్తాయి. కానీ, తక్షణ ఆదాయంలో నష్టాన్ని కలిగిస్తాయి. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, టాక్స్‌పేయర్ చార్టర్ డిజిటల్ పారదర్శకతను పెంచుతాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సౌకర్యాల కొరత వల్ల సవాళ్లు ఎదురవుతాయి.
టీడీఎస్ కరెక్షన్ గడువు 6 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గడం చిన్న
వ్యాపారాలపై కంప్లయన్స్ ఒత్తిడిని పెంచుతుంది. ముగింపుగా, ఈ బిల్లు ఆమోదంలో చర్చ లేకపోవడం విమర్శలను రాబట్టింది. తొందరపాటు ఆమోదం అమలులో సమస్యలను తెస్తుంది. డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం లేకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో అమలు కష్టతరం అవుతుంది. ఈ బిల్లు సామాన్యులకు సరళమైన పన్ను విధానం, రిఫండ్ సౌలభ్యం, డిజిటల్ నిబంధనలను తెస్తుంది.
కానీ, డిజిటల్ కంప్లయన్స్ ఖర్చులు, గోప్యత ఆందోళనలు, గ్రామీణ సవాళ్లు జనానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ప్రభుత్వానికి, ఈ చట్టం దీర్ఘకాలంలో పన్ను ఆదాయాన్ని పెంచినప్పటికీ, తక్షణ ఆర్థిక భారం, అమలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆర్థిక వ్యవస్థను ఆధునీకరిస్తుంది. కానీ, దాని విజయం అమలు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం, ఫైనాన్స్ బిజినెస్ ఎక్స్పర్ట్-