మానవ హక్కులకు భంగం కలిగితే కంప్లయింట్ చేయండి

 మానవ హక్కులకు భంగం కలిగితే కంప్లయింట్ చేయండి
  • ఆన్ లైన్ లోనూ.. దరఖాస్తుగానైనా తీసుకుని పరిశీలిస్తాం
  • రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ 

నల్గొండ అర్బన్, వెలుగు : మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. మంగళవారం నల్గొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్ లైన్ లేదా.. రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే,  పరిశీలించి పూర్తి విచారణ చేసిన చర్యలు  తీసుకుంటామని స్పష్టంచేశారు. 

అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు  చేస్తామన్నారు. వర్కర్స్ కు జీతాలు చెల్లించకపోవడం , హక్కులకు, స్వేచ్ఛకు, సమానత్వానికి ఆటంకం కలిగించడం వంటివి మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయన్నారు. కమిషన్ పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో 11,500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, గడచిన రెండున్నర నెలల్లో 1,500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. కొన్ని కేసులు సుమోటోగా తీసుకున్నామని, బాధితుల తరఫున ఇచ్చే దరఖాస్తులను  సైతం కమిషన్ స్వీకరిస్తుందన్నారు. 

విద్య, వైద్యం తదితర సంస్థలను సందర్శించి సరైన విధంగా అమలవుతున్నది,లేనిది పరిశీలిస్తామన్నారు. మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరికి మంచి విద్య, వైద్యం, సమానత్వం అందాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు.