లైసెన్స్ డ్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయండి.. రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటాం. .

లైసెన్స్ డ్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయండి.. రైతులను మోసం  చేస్తే చర్యలు తీసుకుంటాం. .
  • వరి విత్తనాలు మొలకెత్తలేదు.. మోసపోయాం
  •  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని షాపు ముందు రైతుల ఆందోళన

సూర్యాపేట, వెలుగు: కొనుగోలు చేసిన వరి విత్తనాలు మొలకలు రాలేదని రైతులు ఆందోళనకు దిగిన  ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్య ఆగ్రో ట్రేడర్ షాపు ముందు రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ .. సూర్య ఆగ్రో ట్రేడర్ షాపులో గంగా, కావేరి సన్నరకం వరి సీడ్స్ కొనుగోలు చేసి వేయగా మొలకెత్తలేదని,  నకిలీ విత్తనాలతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.   

గత నెల 23న మండె కడితే రెండు మూడు రోజుల్లో మొలకెత్తాల్సి ఉండగా వారం రోజులైనా రాలేదని పేర్కొన్నారు.  షాపు ఓనర్ ను  అడిగితే తమకు సంబంధంలేదని,  బ్యాగు ఎలా ఉన్నది అలా తెస్తే వేరేవి ఇస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.  బ్యాగులోంచి విత్తనాలు బయటకు తీసి వేశాకే నకిలీవని తెలిసిందని, బ్యాగ్ తెమ్మంటే ఎలా తేవాలని ప్రశ్నించారు. 

తమ సమస్యపై  వ్యవసాయ అధికారులు స్పందించి విత్తనాల శాంపిల్స్ సేకరించి నకిలీవి అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ.. సూర్య ఆగ్రో ట్రేడర్స్ లో కొనుగోలు చేసిన విత్తనాలు మొలకలు రాలేదని మూడు రోజుల కింద మండల వ్యవసాయాధికారికి రైతులు ఫిర్యాదుతో చేయడంతో సీడ్స్ శాంపిల్స్ సేకరించి  టెస్ట్ కోసం పంపించామని చెప్పారు. 

మొలక శాతం తక్కువ ఉన్నందున  రైతుకు నష్టం జరగకుండా అదే షాపులో మరో మూడు బస్టాల సీడ్ ఇప్పించినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారన్నారు. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే రైతులు  విత్తనాలు కొనుగోలు చేయాలని,  రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. .