
హైదరాబాద్, వెలుగు: కోర్టుధిక్కార పిటిషన్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములపై ఉన్న స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారనే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం ఎలా చేశారని ప్రతివాదులను ప్రశ్నించింది. తమ ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. నాగారంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లపై ఉన్న హైకోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారని బిర్ల మల్లేశ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి సదరు భూమిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు.
కేసులో ప్రతివాదులు వీరే..
కేసులో ప్రతివాదులుగా ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, వసుంధర సిన్హా, ఏకే మహంతి, అమోయ్ కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్ జైన్, ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్త, తరుణ్ జోషి తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్దే ఉన్నారు. జ్ఞానముద్ర (రిటైర్డు సీఎస్ సోమేశ్ కుమార్ భార్య), పావని రావు (రిటైర్డు ఐపీఎస్ ప్రభాకర్ రావు భార్య), ఐశ్వర్యరాజు (ఐఏఎస్ వికాస్ రాజు భార్య), రిటైర్డు డీజీపీ అనురాగ్ శర్మ, ఓం అనిరుధ్ (రాచకొండ కమిషనర్ కొడుకు)
నందిని మాన్ (ఐపీఎస్ విక్రమ్ సింగ్ మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీప్ సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి భార్య), నితేశ్ రెడ్డి(రిటైర్డు డీజీపీ మహేందర్‌రెడ్డి కొడుకు) దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), రేణు గోయల్ (డీజీపీ జితేందర్ భార్య), రేఖా (ఐపీఎస్ ఉమేశ్ షరాఫ్ భార్య), హేమలత (ఇంటిలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి భార్య), ఇందు కావటి (ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య), సవ్యసాచి ప్రతాప్ సింగ్(ఐపీఎస్ గోవింద్ సింగ్ కొడుకు), రాహుల్ (రిటైర్డు ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కొడుకు), వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు) ఉన్నారు.