
బషీర్‌బాగ్, వెలుగు: పాకిస్తాన్ నటి ఫొటోను డీపీగా పెట్టి, పెండ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. ముందుగా బహదూర్‌పురాకు చెందిన 29 ఏండ్ల యువకుడిని సోషల్‌మీడియాలోని మ్యాట్రిమోని గ్రూపు ద్వారా స్కామర్లు సంప్రదించారు. అనంతరం ఫేక్ ఐడెంటిటీతో వాట్సాప్‌లో బాధితుడికి పోస్ట్ చేశారు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ నటి ఫొటోను డీపీగా పెట్టి, 2023 మార్చి నుంచి ఫాతిమా పేరుతో చాట్ చేశారు. అనంతరం ఆమె సోదరిని అంటూ అనీసా పేరుతో మరొకరు తరుచూ చాట్ చేస్తూ పెండ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫాతిమా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని డబ్బులు అడిగారు. మొదట చిన్న మొత్తంలో తీసుకున్న డబ్బులను రిటర్న్ చేసి నమ్మకం కలిగించారు.
తమకు ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని, దానికి కొంచెం సమయం పడుతుందని తెలిపి పెద్దమొత్తంలో డబ్బులు అడిగారు. వారి మాటలను నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 21.73 లక్షలు బదిలీ చేశాడు. ఇటీవల బాధితుడి కాంటాక్ట్ నంబర్‌తో పాటు, అన్ని సోషల్ మీడియా అకౌంట్లను స్కామర్లు బ్లాక్ చేశారు. దీంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.