
- రంగారెడ్డి, సంగారెడ్డి సహామరో రెండు జిల్లాల్లోపైలట్ ప్రాజెక్టుకు కసరత్తు
- ఈ రెండు జిల్లాల్లోనేభారీగా భూఅక్రమాలు
- సీఎం ఆమోదం కోసం ఫైల్
- కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం
- అత్యంత పకడ్బందీగాఆడిట్ చేసేలా ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీలలోని అవకతవకలను సమగ్రంగా పరిశీలించనుంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల్లో ధరణి ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అక్రమాలు అధికంగా జరిగినట్లు గుర్తించిన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాల్లో కూడా ఆడిట్ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం వెళ్లింది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు కేరళకు చెందిన ‘‘సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ కంపెనీ’’తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను పకడ్బందీగా చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
పూర్తి వివరాలు బయటకు తీసేలా యాక్షన్ ప్లాన్
ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియలో డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీల్లో అవకతవకలను గుర్తించనున్నారు. భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటపడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా వందల కోట్లు విలువ చేసే రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు మరో రెండు జిల్లాల్లో భూభాగోతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎంపిక చేసే నిపుణుల బృందంపై ఒత్తిడి లేకుండా, అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు బయటకు తీసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నిపుణుల బృందాలను రెవెన్యూ శాఖలోని ఉన్నత స్థాయి అధికారులతో సంబంధం లేకుండా, స్వతంత్రంగా ఆడిట్ చేసేలా నిర్ణయించినట్లు సమాచారం. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఆడిట్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అక్రమాలు తేలితే భూములు స్వాధీనం
ధరణి పోర్టల్ ద్వారా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనే అనేక అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై నిజాలు వెలికితీయడానికి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరని ప్రభుత్వం భావిస్తున్నది. ఆడిట్ ప్రధానంగా భూ రికార్డుల్లోని లోపాలను గుర్తించడం, అక్రమ లావాదేవీలను వెలికితీయడం, నిందితులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగనుంది. నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని పలు కీలక అంశాలను నిశితంగా పరిశీలించనున్నారు. నిషేధిత జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి, ఎందుకు మారాయి, కోర్టు ఉత్తర్వుల పరిస్థితి, వాటి ప్రామాణికత, బోగస్ డాక్యుమెంట్ల సృష్టి, పనివేళల్లో, అర్ధరాత్రి తర్వాత జరిగిన లావాదేవీలు, వాటికి అనుమతి ఇచ్చింది ఎవరు వంటి అంశాలను
సాంకేతిక సమాచారంతో సరిపోల్చి నిర్ధారిస్తారు.
బాధ్యులపై క్రిమినల్ కేసులు!
ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో, సదరు భూములను వెంటనే స్వాధీనం చేసుకుని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకువచ్చింది. అంతకంటే ముందే జాగ్రత్తగా ధరణి పోర్టల్‌కు సంబంధించి వివరాలన్నింటిని బ్యాకప్ చేసి పెట్టింది. దీంతో ఇప్పుడున్న భూ భారతి పోర్టల్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండానే.. ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ జరగనుంది. ధరణి వచ్చినప్పటి నుంచి జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోని చేయాలా? లేక అంతకంటే ముందే భూ రికార్డుల ప్రక్షాళన టైమ్ నుంచి చేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.అయితే ధరణి పోర్టల్ కేంద్రంగానే చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.