హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ తప్పితే.. మిగిలిన ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. బూతులు తిట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో ఆమె మాట్లాడారు.
‘‘తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరు గ్యారంటీలు అంటూ రాష్ట్రాన్ని మోసం చేసింది. మరోసారి ఐదు గ్యారంటీలు అంటూ దేశాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. రాహుల్ గాంధీ అన్నట్టు.. కాంగ్రెస్ గ్యారంటీలన్నీ ఆత్మలే.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను బొందపెట్టి.. రేవంత్ రెడ్డి వాటిని ఆత్మలను చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరిచ్చిన గ్యారంటీలు ఎక్కడా కనిపించక ఆత్మలై తిరుగుతున్నయ్’’అని ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతగాక... ఉప్పల్ స్టేడియంలో రేవంత్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు.