
కేంద్రం, సీబీఐ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు: గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న మన కార్మికుల ఆదుకునే ఏం చర్యలు చేపడుతున్నది తెలపాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ పిల్‌ను విచారించింది. సరైన జీతాలు లేక గల్ఫ్ దేశాల్లో కార్మికులు వేధింపులకు గురవుతున్నారని బసంత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని ప్రస్తావించారు. యజమానులు కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తూ సరైన వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించేలా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ఆ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు. వాదనలు విన్న బెంచ్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, బీహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
For More News..