మగవాళ్లలో లంగ్ క్యాన్సర్.. కారణాలు ఏంటంటే?

మగవాళ్లలో లంగ్ క్యాన్సర్.. కారణాలు ఏంటంటే?

లంగ్ క్యాన్సర్, టీబీ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దగ్గు, జ్వరం, కళ్లె (కఫం) లో రక్తం పడటం, బరువు తగ్గటం, ఆయాసం వంటివి కనిపిస్తాయి. దీంతో క్యాన్సర్​ను గుర్తించేసరికి ఆలస్యం అవుతుంది. లంగ్ క్యాన్సర్​ ఉంటే మొదటి స్టేజ్​లో పొడి దగ్గు వస్తుంది. మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్​ని కలవాలి. ఈ విషయంలో పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొందరికి తొలిదశలో దగ్గు ఉండదు. దగ్గు, ఆయాసం వచ్చేసరికి జబ్బు ముదిరిపోతుంది. 

కొందరిలో దగ్గుతోపాటు కళ్లె పడొచ్చు. కళ్లెలో రక్తం చారలు కనిపిస్తాయి. అంటే అప్పటికే జబ్బు ముదిరిపోయినట్టు. దగ్గుతోపాటు రోజంతా జ్వరం. అకస్మాత్తుగా బరువు తగ్గడం... అంటే ఒకటి నుంచి రెండు నెలల్లో మూడు కిలోల వరకు తగ్గడం. గాలి గొట్టాలు మూసుకుపోయి, ఊపిరితిత్తుల చివరి భాగం సగం లేదా పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆయాసం వస్తుంది. దాదాపు 60 శాతం మందిలో ఛాతి నొప్పి, అసౌకర్యం ఉంటాయి. కొందరిలో బొంగురు గొంతు ఒక్కటే కనిపిస్తుంది. దగ్గినప్పుడు శబ్దం రాదు. లంగ్​ క్యాన్సర్ నాలుగో దశకి వచ్చిందంటే క్యాన్సర్​ ఇతర భాగాలకు వ్యాపించి.... ఆ భాగాల్లో కూడా లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు

  • సిగరెట్, చుట్ట, బీడీ తాగడం. గుట్కా, జర్దా వంటివి తినడం, నమలటం వల్ల అవి శ్వాసనాళం లేదా రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. ఆ తరువాత      నెమ్మదిగా జన్యువుల పనితీరును దెబ్బతీసి ట్యూమర్స్​కు దారితీస్తాయి.
  • కాలుష్యం వల్ల 3 –5 శాతం ఎఫెక్ట్ అవుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగలతో 2 –3 శాతం క్యాన్సర్​ బారిన పడుతున్నారు. 
  • దాదాపు 2 శాతం వరకు జన్యువులు కారణం అవుతున్నాయి.
  • పొగాకు మానేయాలి. పొల్యూషన్​కి దూరంగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్ తినాలి. ఎక్సర్​సైజ్ చేయాలి. ప్రి –స్క్రీనింగ్ చేయించుకోవాలి. అన్నింటికీ మించి అవేర్​నెస్ అనేది చాలా ముఖ్యం.

ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 2020 నుంచి 2040 మధ్య కాలంలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వల్ల చనిపోయే వాళ్ల సంఖ్య కూడా 85 శాతం పెరగవచ్చని ఒక స్టడీ అంచనా వేసింది. అల్ప, మధ్య ఆదాయ దేశాలపై ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ భారం ఎక్కువగా ఉంటుందని చెప్పింది ఆ స్టడీ. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వాళ్లల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.50 ఏళ్లు దాటిన పురుషులకు ఈ క్యాన్సర్‌ రిస్క్‌ ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, ముందస్తు చర్యలు చేపట్టాలని లాన్సెట్‌ పరిశోధకులు సూచించారు. 

ప్రొస్టేట్​ క్యాన్సర్​ను త్వరగా గుర్తించడం, ప్రజల్లో అవగాహన పెంచడం అవసరం. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలపై పేద, మధ్య ఆదాయ దేశాల్లోని వాళ్లకి సరైన అవగాహన ఉండదని వాళ్లు చెప్తున్నారు. అలాగే, ఈ క్యాన్సర్‌ వెన్నుకు పాకడం వల్ల ఎముకల్లో నొప్పి వంటి వాటిని సరిగా కనిపెట్టలేరు. పేద దేశాల్లో చికిత్సకు అవకాశాలను పెంచాలి. ప్రస్తుతం ఏటా14 లక్షల మంది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, 2020లో దీని కారణంగా 3.75 లక్షల మంది మరణించారని చెప్పారు. 2040 నాటికి ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య 29 లక్షలకు, మరణాల సంఖ్య ఏడు లక్షలకు పెరగవచ్చనేది వాళ్ల అంచనా.

అది మామూలే..

మగవాళ్లలో 50 ఏండ్లు దాటిన తర్వాత ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బటం మామూలే. చాలామంది అది క్యాన్సర్​ అనుకొని భయపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. అయితే, ప్రొస్టేట్ గ్రంథి ఉబ్బటానికి కచ్చితమైన కారణాలు తెలియదు. మూత్రాశయానికి కిందివైపు మూత్రనాళం చుట్టూ లింక్​ అయ్యి ఉండే ఇది పెరుగుతూ వస్తుంది. అందువల్ల మూత్రాశయం, మూత్రనాళం మీద ఒత్తిడి పడుతుంది. దాంతో మూత్రం ధార సన్నబడటం, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్​ని సంప్రదించాలి. కొన్ని టెస్ట్​ల ద్వారా సమస్యను గుర్తించి ఏం చేయాలో చెప్తారు. ట్రీట్​మెంట్ తీసుకోకపోయినా కొన్ని సింపుల్ ట్రిక్స్‌ తో ఇబ్బంది నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. 

  • పడుకోవడానికి దాదాపు రెండు గంటల ముందు నీళ్లు లేదా ద్రవాలు తీసుకోకూడదు.
  • బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణానికి ముందు ద్రవాలు మితంగా తీసుకోవాలి.
  • యూరిన్ వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే వెళ్లాలి.
  • యూరినేషన్ సమయాలను డిసైడ్ చేసుకోవాలి. మూత్రం వస్తున్నట్టు అనిపించకపోయినా ఆ టైంకి బాత్​రూమ్​కి వెళ్లాలి. కాస్త టైం పట్టినా పర్వాలేదు. మూత్రాశయం   పూర్తిగా ఖాళీ చేయాలి. 
  • జలుబు, ముక్కు దిబ్బడ, అలర్జీ తగ్గడానికి వాడే యాంటీ హిస్టమైన్ల వంటి మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మూత్రం ధార మరింత   సన్నబడేలా చేయొచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా అడ్డుపడొచ్చు. 
  • ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చక్కెర మోతాదు తగ్గించాలి. కొవ్వు తక్కువగా ఉన్న మాంసం తినాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. అవిసె గింజలు వేగించి,   సోంఫు కలిపి తీసుకుంటే యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అందుతాయి. రోజుకి రెండుసార్లు గ్రీన్​ టీ తాగాలి. విటమిన్ – డి ఉండాలి. క్యాన్డ్​, కలర్డ్,   ప్రాసెస్డ్ ఫుడ్స్, బార్బెక్యూలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అసలు తినకపోతే ఇంకా మంచిది.