
న్యూఢిల్లీ: బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) అత్యంత సురక్షితం కాబట్టే ఎక్కువ మంది వీటిలో డబ్బు పెట్టేందుకు ఇష్టపడతారు. దాదాపు అన్ని బ్యాంకులు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల టెన్యూర్ల ప్రకారం ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. ఎఫ్‌డీని ఎన్నుకునే ముందు వడ్డీ రేట్లను తప్పకుండా పోల్చాలి.ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఎఫ్‌డీ టెన్యూర్లు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటాయి. సాధారణ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 2.9శాతం నుండి 5.4శాతం మధ్య ఉంటాయి. కొత్త రేట్లు ఈ జనవరి నుండి అమలులోకి వచ్చాయి. యెస్ బ్యాంక్ రెగ్యులర్ , సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలను అందిస్తున్నది. ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు గడువు ఉండే డిపాజిట్లపై 3.50శాతం నుండి 6.75శాతం వరకు వడ్డీ రేటును సాధారణ డిపాజిటర్లకు అందిస్తుంది. ఈ బ్యాంకు 2021 ఫిబ్రవరి 8 నుండి తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 2.50శాతం నుండి 5.25శాతం వరకు ఉంటాయి. గత నెల నుండి ఈ రేట్లు వర్తిస్తున్నాయి. కెనరా బ్యాంక్ తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ) కూడా గత నెల నుంచి మారాయి. ఈ సంస్థ సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి పదేళ్ల వరకు టెన్యూర్లు కలిగిన ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తోంది. వడ్డీరేట్లు 2.95శాతం నుండి 5.5శాతం వరకు ఉన్నాయని బ్యాంకు సీనియర్ ఆఫీసర్ ఒకరు ఈ సందర్భంగా తెలిపారు.
బ్యాంకుల వడ్డీ రేట్లు
(7 రోజులు నుంచి 10 ఏళ్ల కాలానికి)
బ్యాంకు శాతం
ఎస్.బి.ఐ 2.9 - 5.4
యెస్ 3.5 - 6.75
కోటక్ 2.5 - 5.25
కెనెరా 2.95 - 5.5