అప్పు కట్టలేదా? మీకూ హక్కులున్నాయ్​!

అప్పు కట్టలేదా? మీకూ హక్కులున్నాయ్​!

న్యూఢిల్లీ:  ఆర్థిక సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, హాస్పిటల్​వంటి పెద్ద ఖర్చులు రావడం వంటి సమస్యల కారణంగా చాలా మంది అప్పులు కట్టలేకపోతుంటారు. ముఖ్యంగా పర్సనల్​లోన్లు, క్రెడిట్​కార్డుల బిల్స్​, కిస్తీల ఎగవేతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆర్​బీఐ, క్రెడిట్​ఇన్ఫర్మేషన్​ లిమిటెడ్​(సిబిల్) లెక్కలను చూస్తే.. ఇలాంటి ఎగవేతలు కరోనా ముందు నాటికంటే కంటే ఎక్కువగా ఉన్నాయి. కిస్తీలు కట్టకపోవడంతో డిఫాల్టర్లు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.  లోన్​ రికవరీ ఏజెంట్లు విపరీతంగా ఇబ్బందిపెడుతుంటారు. తరచూ కాల్స్​ చేసి విసిగిస్తుంటారు. 

కిస్తీలు కట్టకపోవడంతో క్రెడిట్​హెల్త్​ బాగా దెబ్బతింటుంది. క్రెడిట్​స్కోర్​ తగ్గడం వల్ల అప్పులపై ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఉద్దేశపూర్వకంగా అప్పులను ఎగ్గొట్టే వారిని మినహాయిస్తే మిగతా వారి కేసులను సానుభూతితో చూడాలని, బకాయిలు కట్టేందుకు తగినంత గడువు ఇవ్వాలని రూల్స్​ చెబుతున్నాయి. ఇలాంటి బాధితులకూ కొన్ని హక్కులు ఉంటాయి. ముందుకు వీళ్లకు నోటీసులు ఇవ్వాలి. అప్పుల వసూలుకు వేధించకూడదు. సమస్య పరిష్కరించుకునేందుకు లీగల్​అసిస్టెన్స్​తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. క్రెడిట్​రిపోర్టింగ్​సక్రమంగా ఉండాలి. 

ఆర్​బీఐ గైడ్​లైన్స్​ ఏం చెబుతున్నాయ్​ ?

డిఫాల్టర్లకు సాయం చేయడానికి ఆర్​బీఐ కొన్ని గైడ్​లైన్లను విడుదల చేసింది. అప్పు కట్టలేని వారిని లోన్​ను రీస్ట్రక్చర్​ చేయాలి. ఈఎంఐని తగ్గించాలి. రీపేమెంట్​ పీరియడ్​ను పెంచాలి. దీనివల్ల డిఫాల్టర్లు అప్పులు చెల్లించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన రూ.10 లక్షల లోన్​ను కట్టలేకపోతున్నాడు. ఆర్​బీఐ గైడ్​లైన్స్​ ప్రకారం ముందుగా రూ.ఐదు లక్షలు మెల్లమెల్లగా, ఒత్తిడి లేకుండా కట్టడానికి అనుమతించాలి. దీర్ఘకాలంలో మిగతా మొత్తాన్ని వసూలు చేయాలి. అప్పు చెల్లింపు ఆలస్యమైతే క్రెడిట్​స్కోర్​ తగ్గుతుంది. దీనివల్ల అప్పులు పుట్టడం కష్టమవుతుంది. పుట్టినా ఎక్కువ వడ్డీ భరించాలి.  స్కోరు కనీసం 750 పాయింట్లు ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ ఉంటుంది. 

బ్యాంకులు ఎలా వ్యవహరించాలి ?

డిఫాల్టర్లపై ఘర్షణపూరిత వైఖరిని ప్రదర్శించకూడదు.   బాధితుల పరిస్థితులకు తగిన పరిష్కారాన్ని అందించాలి. వాళ్లు భరించగలిగేలా కిస్తీల మొత్తాన్ని మార్చాలి. డిఫాల్టర్లు కూడా తమ సమస్యను వీలైనంత త్వరగా బ్యాంకుకు తెలియజేయాలి లోన్​రీస్ట్రక్చర్​ కోరాలి. క్రెడిట్​స్కోర్​ను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.   సమస్య నుంచి బయటపడేందుకు నిపుణుల సాయం తీసుకోవాలి. 

 డిఫాల్టర్ల చట్టపరమైన హక్కులు ఏమిటి?

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరితమని వర్గీకరించిన ఖాతాలకు రాజీ చేసుకోవాలని లేదా టెక్నికల్ రైట్-ఆఫ్‌‌లను చేపట్టాలని బ్యాంకులను,  ఫైనాన్స్ కంపెనీలను ఆర్​బీఐ ఇటీవల ఆదేశించింది.   రాజీలకు, సెటిల్‌‌మెంట్‌‌లకు వచ్చిన బ్యారోవర్లు  కనీసం 12 నెలల కూలింగ్ పీరియడ్​ తరువాత కొత్త లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకులను బట్టి కూలింగ్​ పీరియడ్​ మారుతూ ఉంటుంది. డిఫాల్టర్లకు 1. నోటీసును పొందే హక్కు, 2. న్యాయమైన అప్పు వసూలు పద్ధతుల హక్కు, 3. ఫిర్యాదు, పరిష్కార హక్కు, 4. న్యాయ సహాయం కోరే హక్కు, 5. ఫెయిర్ క్రెడిట్ రిపోర్టింగ్ పొందే హక్కులు ఉంటాయి.