సంజయ్ సవాల్ పై రెండేండ్లు ఏం చేసినవ్: అరుణ

సంజయ్ సవాల్ పై రెండేండ్లు ఏం చేసినవ్: అరుణ
  • బాధ్యత గల మంత్రిగా నువ్వే టెస్టు చేయించుకో: అర్వింద్  
  • కేటీఆర్​కు మతి భ్రమించింది: రాణి రుద్రమ

హైదరాబాద్/న్యూఢిల్లీ/రాజన్న సిరిసిల్ల, వెలుగు: బాడీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్నాకే మంత్రి కేటీఆర్​దొంగ సవాల్ విసురుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ‘‘దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు’’గా కేటీఆర్ సవాల్​ఉందని విమర్శించారు. రెండేండ్ల కింద తమ పార్టీ అధ్యక్షుడు సంజయ్ సవాల్ చేసినప్పుడు.. గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా? అని అడిగారు. ‘‘ఏ డ్రగ్ తీసుకున్నా రకాన్ని బట్టి.. దాని ఆనవాళ్లు మనిషి శరీరంలో 24 గంటల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయి.  దున్నపోతు మీద వర్షం పడ్డట్టు... రెండేండ్ల కిందట సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా, ఇప్పుడు ప్రతిసవాల్ విసిరితే ఏం లాభం. అప్పుడు సంజయ్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి అక్కడ డిఅడిక్షన్ ట్రీట్ మెంట్ తీసుకొని వచ్చాక సవాల్ చేస్తున్నావా?” అని కేటీఆర్ పై మండిపడ్డారు. సంజయ్ పై కేటీఆర్ చేసిన కామెంట్లను ఖండిస్తూ మంగళవారం అరుణ ప్రకటన విడుదల చేశారు. ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ‘‘ఒకఎంపీ, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన సంజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం. సీఎం కొడుకై ఉండి, భవిష్యత్ సీఎం అని ప్రచారం చేయించుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. ఉడత ఊపులకు.. పిట్ట బెదిరింపులకు, పిల్లచేష్టలకు ఇక్కడ ఎవరూ భయపడరు. పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు” అని హెచ్చరించారు. 

డ్రగ్స్ కేసుల్లో కేటీఆర్ దోస్తులు: అర్వింద్  

తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మంత్రి కేటీఆర్ పై ఉందని ఎంపీ అర్వింద్ అన్నారు. మంత్రిగా, సీఎం కొడుకుగా తానే స్వయంగా డ్రగ్ టెస్టు చేయించుకొని పబ్లిక్ డొమైన్ లో రిపోర్టు పెట్టాలని డిమాండ్ చేశారు. అది కేటీఆర్ కే మంచిదని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. ‘‘మంత్రిపై తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన దోస్తులు డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు. మంత్రి అంటే పబ్లిక్ సర్వెంట్. పారదర్శకంగా బతకాలి. అందుకే కేటీఆర్ తన నిజాయతీ నిరూపించుకోవాలి” అని అన్నారు. 2015 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 రోజుల ప్రణాళిక ఏమైందని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామంటూ చేసిన హామీలు, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు. దళిత బంధు, గిరిజన బంధు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

కేటీఆర్​కు మతిభ్రమించింది: రాణి రుద్రమ 

మంత్రి కేటీఆర్​కు మతిభ్రమించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ‘‘సంజయ్ తంబాకు తింటారని కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. సంజయ్​ తంబాకు తినరని నిరూపిస్తే చెప్పు దెబ్బలు తినడానికి కేటీఆర్ సిద్ధమేనా?” అని ప్రశ్నించారు. మంగళవారం సిరిసిల్లలో రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. ‘‘తన చెల్లె కవిత జైలుకు పోతదని తెలిసి కేటీఆర్ మతిభ్రమించింది.ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు. ప్రధాని మోడీ, బీజేపీ స్టేట్​చీఫ్ సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పై కామెంట్లు చేస్తే ఊర్కోం. సంజయ్ నిబద్ధత గల నాయకుడు. సంజయ్​ చిత్తశుద్ధిపై అసెంబ్లీ ముందు చర్చ పెడదాం.. కేటీఆర్ వస్తాడా?” అని సవాల్ విసిరారు. సంజయ్ ఎంపీగా కరీంనగర్ కు రూ.7 వేల కోట్ల నిధులు తెచ్చారని చెప్పారు. ‘‘తీగల గుట్ట ఆర్వోబీకి సంబంధించి కేటీఆర్ సుట్టపాయిన ఎంపీగా ఉండి రూపాయి తీసుకురాలేడు. సంజయ్​ఎంపీ అయిన తర్వాతనే నిధులు తెచ్చారు. నిధులు వచ్చినా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే” అని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకవర్గంలో సెస్ లో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.