‘మహా’ రాజకీయంలో అసలేం జరిగింది? మీకోసం..

‘మహా’ రాజకీయంలో అసలేం జరిగింది? మీకోసం..

తెల్లారేసరికి తారుమారైందన్న నానుడి సరిగ్గా మహారాష్ట్ర పాలిటిక్స్​కి సరిపోతుంది. అర్ధరాత్రి సమయానికి శివసేన-కాంగ్రెస్​-ఎన్సీపీలు ఒక ఒప్పందానికి వచ్చి, ఉద్ధవ్​ థాక్రే సీఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించారు. అదే వార్తతో  ప్రింట్​ మీడియా డెడ్​లైన్​ ముగించుకుంది. ఉదయాన పేపర్​ చదివేవాళ్లకుకూడా ఈ వార్తే అందింది. మరికాసేపటిలోనే చానెళ్లన్నీ దేవేంద్ర ఫడ్నవీస్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజువల్స్​ చూపిస్తుంటే వ్యూయర్సే కాకుండా, దేశం మొత్తం షాకయ్యింది. ‘నిజమా! అట్లెట్లా…!!’ అని టీవీలకు అతుక్కుపోయారు.

బాలీవుడ్​ సినిమాని మించిపోయిన ట్విస్టులతో మహారాష్ట్ర రాజకీయాలు చకచకా సాగిపోయాయి. దేవేంద్ర ఫడ్నవీస్​ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవినందుకున్నారు. శరద్​ పవార్​ అన్న కొడుకు అజిత్​ పవార్​ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇద్దరితో ఏర్పడ్డ బీజేపీ–ఎన్సీపీ అలయెన్స్​ ప్రభుత్వానికి గవర్నర్​ కోషియారీ వారం రోజుల గడువిచ్చారు. ఈ నెల 30నాటికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. టీవీ ఆఫ్​ చేసే సమయానికి శివసేనతో కలిసున్న ఎన్సీపీ… ఉదయాన టీవీ ఆన్​ చేసేటప్పటికి బీజేపీతో పొత్తు కలిసింది. ఇంత సడెన్​గా ఎలా మారిందన్నది ఎవరికి తోచిన అంచనాతో వాళ్లు మాట్లాడుతున్నారు. రోజుకో ట్విస్ట్​, క్షణానికో మలుపు అన్నట్లుగా సాగిన మొత్తం పొలిటికల్​ గేమ్​లో నిబ్బరంగా ఉన్న వ్యక్తి ఒకే ఒక్కరు… సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​. హంగ్​ అసెంబ్లీ ఏర్పడినప్పటినుంచి శనివారం తెల్లవారు జామువరకు ‘మళ్లీ మా ప్రభుత్వమే ఏర్పడుతుంది’ అన్న మాటను మానలేదు ఫడ్నవీస్​. ఆయన చిన్నప్పట్నుంచీ ఆరెస్సెస్​ శిక్షణలో ఆరితేరారు.  స్థితప్రజ్ఞతతో ఆలోచిస్తూ మనో నిబ్బరంతో కనిపించారు. ఫడ్నవీస్​ మెచ్యూరిటీ లెవెల్స్​ని ఎక్కడా తక్కువ అంచనా వేయలేమంటున్నారు ఎనలిస్టులు.  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్​చార్జిగా పనిచేసిన భూపేంద్ర యాదవ్​ సహకారంకూడా ఇక్కడ పనిచేసిందంటున్నారు. బీజేపీ ప్రెసిడెంట్​ అమిత్​ షాకి యాదవ్​ నమ్మినబంటు. ఇవన్నీ ఎలా ఉన్నాగానీ, మహారాష్ట్రలో రాత్రికి రాత్రి ప్లాన్​ మారిపోవడం వెనుక కొన్ని కారణాలున్నాయని ఎనలిస్టులు అంటున్నారు.

వీటిలో ప్రధానంగా వినిపిస్తున్నవి…

1) శరద్​ పవార్​కి బీజేపీ రాష్ట్రపతి పదవిని ఆశ చూపించిందన్నది వీటిలో ఒకటి.  పవార్​ నాయకత్వంలోని నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) చాలా మర్యాద కలిగిన పార్టీగా ప్రధాని మోడీ ఈ మధ్య పార్లమెంట్​లో ఆకాశానికెత్తేశారు. ఆ తర్వాత పవార్​–మోడీల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లోనే ఆయనకు రాష్ట్రపతి పదవిని ఆశ పెట్టారని చెబుతున్నారు.

2) శరద్​ పవార్​, అజిత్ పవార్​లు కేసులు తప్పించుకోవడానికి కలిశారన్నది మరో వాదన. వీరిద్దరిపైనా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) మనీ లాండరింగ్​ కేసులు నమోదు చేసింది. మహారాష్ట్ర స్టేట్​ కోఆపరేటివ్​ బ్యాంక్​ (ఎమ్మెస్​సీబీ)లో వీళ్లు 25,000 కోట్ల రూపాయల మేర ఫ్రాడ్​ చేశారన్న ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా కోఆపరేటివ్​ షుగర్​ ఫ్యాక్టరీలకు లోన్లు ఇప్పించారన్నది వీరిపైగల ఆరోపణ.  ఈ విషయం బొంబాయి హైకోర్టు వరకు వెళ్లగా కేసు నమోదు చేయాలని ముంబై పోలీసు ఆర్థిక నేరాల వింగ్​ని
ఆదేశించింది.

3) శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే పూర్తిగా ఫ్యామిలీ వత్తిడికి లొంగిపోయారన్నది ఊహ. తన కొడుకు ఆదిత్య సీఎం కావాలన్న భార్య రష్మి థాక్రే కోరికను కాదనలేక బీజేపీతో మొండిగా వ్యవహరించారని చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ ఇచ్చిన తప్పుడు సలహాలుకూడా ఉద్ధవ్​ కొంపముంచాయని వినిపిస్తోంది. సంజయ్​కి మొదటి నుంచీ బీజేపీ పొడ గిట్టదని. పార్టీ పత్రిక ‘సామ్నా’ వేదికగా తరచు బీజేపీని విమర్శిస్తుంటారని అందరికీ తెలిసిందే.

ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ… అసలు కాంగ్రెస్​ వ్యతిరేకతతో పుట్టిన శివసేన, కేవలం అధికారంకోసమే ఆ పార్టీ చుట్టూ చక్కర్లు కొట్టడాన్ని సగటు శివసైనికుడు భరించలేకపోయాడని ఎనలిస్టులు అంటున్నారు. కాంగ్రెస్​, ఎన్సీపీలకు అటు శివసేనతోగానీ, ఇటు బీజేపీతోగానీ మొదట్నుంచీ సంబంధాలు లేవు. ఇవి రెండూ హంగ్​ ఫలితాలు రాగానే బీజేపీని దూరంగా పెట్టడానికి మూడో పార్టీని దువ్వుతూ వచ్చాయి. ఈ ట్రాప్​లో ఉద్ధవ్​ థాక్రే చిక్కుకున్నారు. ఒకవైపు పుత్రవాత్సల్యం, మరోవైపు భార్య రష్మి పట్టుదల, సంజయ్​ రౌత్​ సలహాలతో మరో ఛాన్స్​ లేకుండా చేసుకున్నారు. ఫిఫ్టీ ఫిఫ్టీ పవర్​ షేరింగ్​ అన్న సింగిల్​ పాయింట్​ అజెండా నుంచి కిందకు దిగకుండా బీజేపీని దూరంగా నెట్టేశారు. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్​లతో బేరసారాలు సాగించారు. అసెంబ్లీలో 44 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్​కి శివసేనతో కలవడం ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లనే ఫస్ట్​టైమ్​ ఈ నెల 10న శివసేనకు సపోర్ట్​ ఇవ్వడానికికూడా వెనకాముందూ ఆడింది. అయితే, ప్రధాని మోడీని 20వ తేదీన శరద్​ పవార్​ కలవడంతో కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ… శివసేనకు సపోర్ట్​ ప్రకటించారు. అక్కడ్నుంచి పరిణామాలన్నీ వేగంగా కదిలాయి. ఉద్ధవ్​ థాక్రే సీఎంగా, కాంగ్రెస్​, ఎన్సీపీల నుంచి ఇద్దరు డిప్యూటీ సిఎంలు, ఎమ్మెల్యేల రేషియోలో మంత్రి పదవులు ఉండేలా అంతా రెడీ చేసుకున్నారు.  యూపీయే తన ట్రంప్​ కార్డయిన ‘కామన్​ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ)’ బయటకు తీసి, ఉద్దవ్​ కాదనలేని పరిస్థితిని కల్పించింది. బీజేపీతో తన కొడుకుకోసమే డిమాండ్​ పెట్టారు తప్ప, తనకోసమంటూ ఉద్ధవ్​ ఎప్పుడూ అడగలేదు.

నిజానికి, శివసేనలో థాక్రే ఫ్యామిలీ తెర వెనుక నుంచే రాజకీయం నడిపించేది. బీజేపీ ఒక దశలో ఆఫర్​ చేసినా ఉద్ధవ్​ టెంప్ట్​ కాలేదు. అలాంటిది ఎన్సీపీ, కాంగ్రెస్​లు ఆడిన డ్రామాలో ఇరుక్కుని, పదవికి ఒప్పుకోవలసి వచ్చింది. ఈ సీక్వెన్స్​ మొత్తం మహారాష్ట్ర పాలిటిక్స్​పై అవగాహన ఉన్నవాళ్లనుకూడా అయోమయంలోకి నెట్టేసింది. శివసేన, ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లే తలపడ్డాయని ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు. చివరికి, అధికారంకోసం ఉద్ధవ్​ థాక్రే తన తండ్రి ఆశయాలను వదిలేసుకున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు.

పవార్లు ఆడిన పవర్​ గేమ్​?

శుక్రవారం సాయంత్రం ఒకపక్క చిన్నాన్న శరద్​ పవార్​, శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రేలు ప్రభుత్వ ఏర్పాటుకు చర్చిస్తుంటే… రాత్రి 8 గంటల సమయంలో ఉన్నట్టుండి అజిత్​ పవార్​ లేచి వెళ్లిపోయారు. ఆ సమయానికి ఆయన చేతిలో ‘ప్రభుత్వ ఏర్పాటుకు మేము ఒప్పుకున్నాం’ అనే సింగిల్​ లైన్​తో ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లిస్ట్​ ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ లెటర్​నే ఫడ్నవీస్​ ప్రభుత్వానికి సపోర్ట్​గా శనివారం ఉదయాన గవర్నర్​ కోషియారీ చేతికి అజిత్​ పవార్​ అందజేశారని చెప్తున్నారు. ఇంత షాకింగ్​ ట్రీట్​మెంట్ పార్టీ పెద్దాయన శరద్​ పవార్​కి తెలియకుండా జరగదని ఒక న్యూస్​ ఏజెన్సీ అంచనా. ‘శరద్​జీ పార్టీ చీఫ్​. ఆయన అనుమతితోనే అజిత్​ సపోర్ట్​ లెటర్​ ఇచ్చారు’ అని ఎన్సీపీ వర్గాలు ఈ ఏజెన్సీతో అన్నారట! పార్టీ వారసత్వం విషయంలో అజిత్​ పవార్​కి, సుప్రియా సూలేకి మధ్య కొంత తగాదా నడుస్తున్న మాట నిజమేనని,  అలాగని చిన్నాన్నను కాదని అజిత్​ సొంత నిర్ణయం తీసుకోలేరని అంటున్నారు. అజిత్​ వెనుక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంచనా.

ఉద్దవ్​ ఊగిసలాట వల్లనే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాక సరిగ్గా నెల రోజులపాటు సాగిన పొలిటికల్​ డ్రామాలో తండ్రీ కొడుకుల తప్పులే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎనలిస్టులు. వాళ్లిద్దరూ శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే, ఆయన కొడుకు, యూత్​ వింగ్​ని నడిపిస్తున్న ఆదిత్య థాక్రే. బీజేపీకి 105, తమకు 56 సీట్లతో హంగ్​ రిజల్ట్స్​ రాగానే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఉద్ధవ్​ షరతులు పెట్టారు. అయిదేళ్ల కాలాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామన్నారు. దీనిపై ఈ నెల 10వ తేదీ వరకు చర్చలు సాగాక, బీజేపీ చేతులెత్తేసింది. ఇక, అక్కడ్నుంచి ఉద్ధవ్​ థాక్రే ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా కాంగ్రెస్​, ఎన్సీపీల చుట్టూ చక్కర్లు కొట్టారు. బీజేపీ సహా ప్రతి ఒక్కరూ ఉద్ధవ్​ థాక్రేకి మంచి పోస్టు ఆఫర్​ చేయడం, ఆయన తన కొడుకుకోసం పట్టుబట్టడంతో వ్యవహారం ముందుకు సాగలేదు. కాంగ్రెస్​, ఎన్సీపీలు ససేమిరా ఆదిత్య థాక్రే పేరుకు ఒప్పుకోకపోయేసరికి,  ఏమీ చేయలేని పరిస్థితిలో ఉద్ధవ్​ థాక్రే శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. కానీ, అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది.

సోనియా ఎటూ తేల్చకనే!

శివసేన తమ తలుపు తట్టగానే కాంగ్రెస్​ తెరవలేదు. ఎందుకంటే, ఆ పార్టీ మొదట్నుంచీ కాంగ్రెస్​ వ్యతిరేక అజెండాతో ఉంది. దానికితోడు బీజేపీతో దాదాపు 30 ఏళ్లుగా పొత్తు కొనసాగిస్తోంది. దేశంలో సెక్యులర్​ ట్యాగ్​తో  సెంట్రిక్​ లెఫ్ట్​ రాజకీయాలు నడిపించే పార్టీ కాంగ్రెస్​. అందువల్లనే మహారాష్ట్రలో బలమైన కాషాయ పార్టీగా గుర్తింపు పొందిన శివసేనను పట్టించుకోలేదు. బీజేపీ పవర్​ రేస్​ నుంచి తప్పుకున్నాక ఈ నెల 10న గవర్నర్​ కోషియారీ శివసేనను పిలిచినప్పుడుకూడా కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ తొందరపడలేదు. తమకు అనుకూలమైన పార్టీకే మద్దతిస్తామని చెప్పి, ఎన్సీపీని ముందుకు నెట్టారు. అయితే, మొన్న బుధవారంనాడు ప్రధాని మోడీ తన చాంబర్​లో శరద్​ పవార్​తో చర్చలు జరపడం సోనియాని కంగారు పెట్టింది. 54మంది సభ్యులుగల ఎన్సీపీ గనుక బీజేపీతో కలిస్తే, ముందు ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్​ పరిస్థితి చాలా దారుణంగా మారిపోవడం ఖాయం. మొదట్లో దూరంగా పెట్టిన శివసేనను ఆఖరి క్షణంలో సమర్థించాల్సి వచ్చింది.

తెర వెనుక భూపేంద్ర, అథావలే

మహారాష్ట్ర పరిణామాల్లో పైకి కనిపించని వ్యక్తులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​, కేంద్ర సహాయ మంత్రి రామదాస్​ అథావలే. వీరిద్దరూ బీజేపీ ప్రెసిడెంట్​ అమిత్​ షాకి సన్నిహితులుగా చెబుతారు. భూపేంద్ర రాజస్థాన్ నుంచి, అథావలే మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. భూపేంద్ర గతంలో రాజస్థాన్​, గుజరాత్​, జార్ఖండ్​, బీహార్​, యూపీల్లో పార్టీకి ట్రబుల్​ షూటర్​గా పనిచేశారు.  బీహార్​లో నితీశ్​ కుమార్​ ప్రభుత్వంతో ఆర్జేడీ తెగతెంపులు చేసుకున్నప్పుడు… గంటల వ్యవధిలో ఎన్డీయే సపోర్ట్​ ఇచ్చింది. ఈ టాస్క్​ని భూపేంద్ర దగ్గరుండి నడిపించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  మహారాష్ట్రలో హంగ్​ ఫలితాలు వచ్చినప్పుడుకూడా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జాగ్రత్తగా పావులు కదిలించింది భూపేంద్రేనని అంటారు. వార్​ రూమ్​ వ్యూహాల్లో మహా దిట్టగా  భూపేంద్ర యాదవ్​కు పార్టీలో గుర్తింపు ఉంది. రామదాస్​ అథావలే మహారాష్ట్రకు చెందిన దళిత నాయకుడు. ఆయన బీజేపీకి అనుకూలంగా శివసేనకు, ఎన్సీపీకి మధ్య రాయబారం నడిపించారు. ఒకపక్క ప్రధాని మోడీ, శరద్​ పవార్​లు రాజ్యసభలోని పీఎం చాంబర్​లో మాట్లాడుకుంటున్నప్పుడు, అథావలే పార్లమెంట్​లోని ఇతర ఎన్సీపీ ఎంపీలతో మంతనాలు సాగించారట! ఎన్డీయేలోకి ఎన్సీపీని తీసుకోవాలంటూ మీడియాకి లీకులిచ్చారని చెబుతారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు.

సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన నాయకుడు

2014 ఎన్నికల తరువాత మహారాష్ట్రలో ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వంలో శివసేన కూడా చేరింది. శివసేన తరఫున 13 మంది మంత్రులు దేవేంద్ర కేబినెట్ లో ఉండేవారు. కొన్ని ముఖ్యమైన అంశాలపై బీజేపీ, శివసేన మధ్య తేడాలు వచ్చినా ఆ ప్రభావం సంకీర్ణ ప్రభుత్వంపై  పడకుండా జాగ్రత్త పడేవారు దేవేంద్ర ఫడ్నవీస్. అయోధ్య వంటి కీలక అంశాన్ని బీజేపీ అటకెక్కించిందంటూ శివసేన పత్రిక ‘సామ్నా’లో అనేకసార్లు కథనాలు వచ్చినా ఫడ్నవీస్ ఎక్కడా తొందరపడేవారు కాదు. సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని కొన్ని సార్లు శివసేన పాటించకపోయినా ఆయన బ్యాలెన్స్ తప్పేవారు కాదు. శివసేన అభిప్రాయాలను తప్పుపట్టే ప్రయత్నం ఏ రోజూ చేయలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శివసేనపై విమర్శలు చేయలేదు. శివసేన విమర్శల విషయాన్ని పార్టీ హైకమాండ్​కు వదిలేసి పాలనారంగంపై దృష్టి పెట్టారు. ఫడ్నవీస్ కు ఉన్న ఈ నాయకత్వ లక్షణాలే ఐదేళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని  కాపాడిందని చెప్పవచ్చు.