సంకల్పం..రామాయణంలో ఏం జరిగింది

సంకల్పం..రామాయణంలో ఏం జరిగింది

ఒక సత్కార్యం ప్రారంభించినప్పుడు పెద్దవారికి నమస్కరించగానే, ‘సంకల్పసిద్ధిరస్తు’ అని ఆశీర్వదిస్తారు. అంటే మనం అనుకున్న సంకల్పం సిద్ధించాలని వారు మనస్ఫూర్తిగా దీవిస్తారు. దృఢ సంకల్పంతో, పట్టుదలతో చేపట్టిన పని తప్పక నెరవేరుతుంది లేదా తప్పక సమకూరుతుంది అని అర్థం. ఏదైనా పని చేయాలని దృఢంగా నిశ్చయించుకోవడమే సంకల్పం. అంటే ఏదైనా ఒక పని చేయాలనే ఆలోచన లేదా భావన అని అర్థం. ఒక కార్యం నెరవేరాలని త్రికరణశుద్ధిగా సంకల్పిస్తే, అలా సంకల్పించిన తరువాత రెట్టింపు ఉత్సాహంతో పనిలో నిమగ్నమవ్వాలి. మనసులో చేసుకున్న చక్కని నిర్ణయాన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకురావాలి. సంకల్పం అంటే మన మనోభావం. ఆ మనోభావమే దృఢ సంకల్పం. 

రామాయణంలో...  విశ్వామిత్రుడు యాగం చేయాలని సంకల్పించాడు. రాక్షసులు ఆ యాగాన్ని విధ్వంసం చేసి, ఆటంకం కలిగిస్తారని విశ్వామిత్రుడికి తెలుసు. కాని తను సంకల్పించిన యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలి. ఆ సదుద్ధేశంతోనే, రామలక్ష్మణులను తన యాగానికి రక్షణగా పంపమని దశరథుడిని కోరాడు. దశరథుడు పుత్రప్రేమతో ముందు నిరాకరించినప్పటికీ, విశ్వామిత్రుని సంకల్పబలమే దశరథుడి చేత రామలక్ష్మణులను తన వెంట పంపేలా చేసింది. ఏ అడ్డంకులూ లేకుండా యాగం పూర్తయింది. సంకల్పబలమే ఏ ఇబ్బందులు లేకుండా కార్యం పూర్తయేలా చూస్తుంది.

వాలి, సుగ్రీవులు సోదరులు. వాలి కారణంగా సుగ్రీవుడు సుదూర ప్రాంతాలకు పారిపోయి, తలదాచుకోవలసి వచ్చింది. ఆ సమయంలో ఒకనాడు రామలక్ష్మణులు సీతమ్మను వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చారు. సుగ్రీవునితో మైత్రి కుదుర్చుకున్నాడు. మహాబలవంతుడైన వాలిని, సుగ్రీవునికి ఇచ్చిన మాట కోసం సంహరించాలని త్రికరణశుద్ధిగా సంకల్పించాడు రాముడు. ఆ విధంగానే వాలిని సంహరించి, సుగ్రీవుడిని కిష్కింధకు రాజుని చేశాడు. 

రావణుడితో యుద్ధం చేయాలంటే ముందుగా సముద్రం దాటాలి. అందుకు వారధి నిర్మించవలసి వచ్చింది. అల్ప జీవులైన వానరుల సంకల్పబలంతో వారధి నిర్మాణం జరిగింది. లంకలోకి ప్రవేశించిన రామలక్ష్మణులు రావణుడిని సంహరించారు. సీతమ్మతో తిరిగి అయోధ్యకు వచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు రాముడు. సంకల్పం బలంగా ఉండాలే కానీ సాధించలేనిది ఏది లేదని వాల్మీకి మహర్షి పరోక్షంగా మనకు చెబుతున్నాడు.

ఇక మహాభారతం విషయానికి వస్తే... కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోతోంది. శత్రుపక్షంలో ఉన్నవారందరూ తన ఆత్మీయులు, బంధువులు కావటంతో అర్జునుడు యుద్ధం చేయకుండా వెనుతిరుగుతానన్నాడు. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించి, కర్తవ్యం గుర్తు చేశాడు. ఆ మాటలతో తన కర్తవ్యం తెలుసుకుని, దుష్ట శిక్షణ చేయటానికి సంకల్పించాడు, ద్రౌపది శపథం నెరవేర్చటం తన బాధ్యత అనుకున్నాడు అర్జునుడు. పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు, కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు అయినప్పటికీ అర్జునుడు దృఢ సంకల్పంతో కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాడు. విజయం సాధించాలనే సంకల్పం లేకపోతే కార్యసిద్ధి కలుగదు.

పారాలింపిక్స్‌‌లో పాల్గొన్న వారిని చూస్తే, వారి సంకల్పం ఎంత దృఢంగా ఉంటుందో అర్థమవుతుంది. అంధులు, అవయవ లోపం ఉన్నవారు, మానసిక పరిపక్వత లేనివారు... వీళ్లంతా క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించటానికి సంకల్ప బలమే కారణం.

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌‌
ధీరుల్‌‌ విఘ్న నిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై  ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రాజ్ఞానిధుల్‌‌ గావుతన్‌‌
అంటాడు... ఏనుగు లక్ష్మణకవి (సంస్కృతంలో భర్తృహరి రచించిన శ్లోకాలకు తెలుగు అనువాదం)

ఎప్పుడో ఏదో అడ్డంకి వస్తుందేమోనని ఏ పనీ చేపట్టనివారు అథములు. ఏదో చేయాలన్న తపనతో పని మొదలుపెట్టి, ఆటంకం ఎదురవ్వగానే మధ్యలోనే వదిలేసేవారు మధ్యములు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక లక్ష్యం కోసం శ్రమించటం కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. వారిలోని సంకల్పబలమే వారిని కార్యసాధన వైపు నడిపిస్తుంది.

అల్లకల్లోలంగా ఉన్న భారతదేశం... జగద్గురు శంకరాచార్యుల సంకల్పంతో ఒక తాటి మీదకు వచ్చింది. విద్యారణ్యుల సంకల్ప బలంతో విజయనగర సామ్రాజ్య నిర్మాణం జరిగింది. స్వామి వివేకానంద ‘ఉత్తిష్ఠ – జాగ్రత – ప్రాప్యవరాన్నిబోధత’ అని చెబుతాడు. ప్రతి మనిషి సత్సంకల్పంతో ఏదో ఒక కార్యం సాధిస్తూనే ఉండాలి’ అని జాతిని జాగృతం చేశాడు. భగవద్గీత కూడా మనకు అదే చెబుతుంది. ‘నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు’ అని. అదే సత్సంకల్పం. సంకల్పం సృజనాత్మక శక్తి యొక్క విస్తరణ ప్రక్రియను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక అంతర్గత శక్తికి అనుగుణంగా ఉంటుంది. ఇక స్వాతంత్య్ర పోరాటం సంఘటన పరిశీలిస్తే... గాంధీ దృఢ సంకల్పంతో సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఎంచుకుని, స్వాతంత్య్రం సాధించాడు. 

కోరిక అంటే ఫలాన్ని ఆశించేది కాబట్టి అది నెరవేరకపోవచ్చు. కాని సంకల్పం అంటే నిస్వార్థమైనది కాబట్టి, తప్పక నెరవేరుతుంది. అందుకే సంకల్పసిద్ధిరస్తు అనే ఆశీర్వచనంలో ఎంతో బలం ఉందని పండితులు చెబుతారు.

- డా. వైజయంతి పురాణపండ, ఫోన్: 80085 51232