హిందీతో మీకు కలిగే నష్టం ఏమిటి?

హిందీతో మీకు కలిగే నష్టం ఏమిటి?

తమిళనాడు ప్రజలు మాతృభాషకు ఎంత విలువనిస్తారు. మరోవైపు హిందీ, సంస్కృతమన్నా అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. తమిళనాడు ప్రభుత్వమూ హిందీ అంటేనే ససేమిరా అనేస్తుంటుంది. ఇప్పుడు దానిపైనే మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు హిందీతో మీకు వచ్చే నష్టమేమిటి? అంటూ ప్రశ్నించింది. చాలా మందికి హిందీ రాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయాల్సిందిగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్ట్ ప్రధాన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా మూడు భాషల అమలు కారణంగా విద్యార్థులపై అధిక భారం పడుతుందన్న ఉద్దేశంతో రెండు భాషలనే సర్కారు అమలు చేస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం వాదించారు. అయినా కూడా చాలా మంది హిందీ ప్రచార్ సభ వంటి ఇనిస్టిట్యూట్ల ద్వారా హిందీ నేర్చుకుంటున్నారని వివరించారు.

అయితే, ఆయన వ్యాఖ్యలకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ పి.డి ఆదికేశవులు ధర్మాసనం.. నేర్చుకోవడానికి, బోధనకు చాలా తేడా ఉంటుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పై నాలుగు వారాల్లోగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఒక్క మాతృభాషనే నేర్చుకోవడంతో ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇతర భారతీయ భాషలనూ నేర్చుకోవాలని, ప్రత్యేకించి హిందీ, సంస్కృత భాషలనూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కడలూరుకు చెందిన అర్జునన్ ఇళయారాజా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం క్లారిటీ