పొల్యూషన్ కట్టడికి ఏం చేశారు? సర్కారుకు హైకోర్టు నోటీసులు

పొల్యూషన్ కట్టడికి ఏం చేశారు? సర్కారుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు :  జీడిమెట్ల పారిశ్రామికవాడకు చెందిన వ్యర్థాలను  డ్రైనేజీల్లోకి వదిలివేయడంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కాలుష్య నియంత్రణ మండళ్లు, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్లతోపాటు 69 పరిశ్రమలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నాలాల్లోకి వదులుతున్నారని సామాజిక కార్యకర్త పి.ఎల్.ఎన్. రావు పిల్ దాఖలు చేశారు. దాన్ని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ. శ్రవణ్ కుమార్లతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.  

జీడిమెట్ల ఏరియాలో  300 పరిశ్రమలుండగా.. ఇందులో 70 దాకా రసాయన, ఔషధ కంపెనీలు ఐడీఏ పరిధిలో ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది అనిరుద్ తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల ద్రవ, ఘనవ్యర్థాలను విడుదల చేస్తున్నాయన్నారు.  ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా నాలాల్లోకి వదులుతున్నారని చెప్పారు. ఆ కాలుష్య జలాలు హుసేన్ సాగర్, మూసీలోకి చేరుతున్నాయని..చివరకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ద్వారా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తున్నాయని వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు  తీసుకున్న చర్యలేమిటో తెలపాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.