దేశమంతా కులగణన .. కేంద్ర కేబినెట్​ సంచలన నిర్ణయం

దేశమంతా కులగణన .. కేంద్ర కేబినెట్​ సంచలన నిర్ణయం
  • జనాభా లెక్కలతోపాటే క్యాస్ట్ సెన్సస్ నిర్వహించేందుకు ఆమోదం
  • కొన్ని రాష్ట్రాల్లో కుల గణన పారదర్శకంగా జరగలే  
  • క్యాస్ట్ సెన్సస్ కేంద్రం పరిధి అంశం: అశ్వినీ వైష్ణవ్ 
  • ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్ 
  • త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికారిక వర్గాలు  
  • అధికారంలో ఉన్నప్పుడు కుల గణనను కాంగ్రెసే 
  • వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటే కుల గణన కూడా చేపట్టనున్నట్టు వెల్లడించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ (సీసీపీఏ) సమావేశంలో కుల గణనకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సీసీపీఏ సమావేశం అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా కుల గణన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. 

తాము ఎంతో కాలంగా కుల గణనకు డిమాండ్ చేస్తుండగా,  కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లకు ప్రకటన చేసిందని.. ఇది ప్రతిపక్షాలకు దక్కిన విజయమని కాంగ్రెస్, ఇతర అపొజిషన్ పార్టీలు పేర్కొన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కుల గణనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కొన్ని రాష్ట్రాల్లో కుల గణన సర్వేలు చేసినా వాటిని రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయని అధికార బీజేపీ ఆరోపించింది. 

వచ్చే జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టే కుల గణనలో కులాలు, ఉప కులాలు, ఒక్కో కులంలో ఎంత మంది ఉన్నారు? వంటి వివరాలను సేకరించనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కుల గణనను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఏనాడూ జాతీయ జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చలేదని విమర్శించారు. ‘‘కుల గణన అంశాన్ని  పరిశీలిస్తామని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఓ గ్రూపు ఏర్పాటైంది. కుల గణనకు అత్యధిక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం సోషియో ఎకానమిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ (ఎస్ఈసీసీ) 2011 పేరుతో సర్వే చేసింది. దీనిని బట్టే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎల్లప్పుడూ కుల గణన అంశాన్ని రాజకీయ అస్త్రంగానే వాడుకున్నాయి” అని కేంద్ర మంత్రి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కుల గణన నిర్వహించినా.. ఆప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్నారు. కొన్ని రాష్ట్రాలు కేవలం రాజకీయ కోణంలోనే కుల గణన సర్వేలు చేశాయని, అలాంటి సర్వేలు సమాజంలో అనేక సందేహాలు ఉత్పన్నమయ్యేలా చేశాయన్నారు. నిజానికి కుల గణనను కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టబద్ధంగా చేయగలదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లో పేర్కొన్న ప్రకారం.. సెన్సస్ అనేది కేంద్ర జాబితాలోని అంశమన్నారు. 

కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు.. 

దేశంలోనే తొలిసారిగా 2023లో బిహార్ లో సీఎం నితీశ్ కుమార్ సర్కారు కుల గణన నిర్వహించింది. అప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ఆయన అధికారంలో ఉన్నారు. తర్వాత ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్ లో కుల గణన తర్వాత నుంచీ ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకున్నారు. 

అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కుల గణన చేస్తామన్నారు. ఇచ్చిన హామీ మేరకు కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కుల గణన సర్వేలు చేశారు. ఇక బిహార్ లో 63 శాతం జనాభా బీసీలు, అట్టడుగు వర్గాల వాళ్లే ఉండటంతో ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.   

త్వరలోనే నిర్వహణ? 

జనాభా లెక్కలు, కుల గణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై మాత్రం అశ్వినీ వైష్ణవ్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, త్వరలోనే జనాభా లెక్కలతోపాటు కుల గణనను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. ఆ తర్వాత 2020 ఏప్రిల్ లో మళ్లీ జనాభా లెక్కలు సేకరించాల్సి ఉండగా.. కరోనా విపత్తు కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఐదేండ్లు ఆలస్యం అయినందున ఇక త్వరలోనే సెన్సస్ నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోందని అధికారిక వర్గాలు అంటున్నాయి. 

రూ.22 వేల కోట్లతో షిల్లాంగ్-సిల్చార్ హైవే 

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ సమీపంలోని మేవ్ లింగ్ ఖుంగ్ నుంచి అస్సాంలో సిల్చార్ సమీపంలోని పంచ్ గ్రామ్ వరకూ 166.80 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మేఘాలయలో 144.80 కిలోమీటర్లు, అస్సాంలో 22 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ హైవే (ఎన్ హెచ్6) ప్రాజెక్టుకు రూ. 22,864 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 

ఈ కారిడార్ తో త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరక్ వ్యాలీ, గువాహటి వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని.. దూరం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుందన్నారు. 

చెరకు కనీస ధర 4.41% పెంపు

దేశవ్యాప్తంగా చెరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ)ని 4.41 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత 2024‌‌‌‌25 సీజన్ లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాలుకు రూ. 340 మేరకు ఉందని, అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న 2025=26 చెరకు సీజన్ లో ఎఫ్ఆర్పీని రూ. 355కు పెంచినట్టు వెల్లడించారు. 

బేసిక్ రికవరీ రేట్ 10.25 శాతానికి ఈ ధరను ఆమోదించినట్టు చెప్పారు. అయితే, రికవరీ రేట్ 9.5 శాతం కంటే తక్కువగా ఉన్న షుగర్ మిల్లులు మాత్రం అలాంటి రైతులకు క్వింటాలుకు కనీసం రూ. 329 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చే సీజన్ లో చెరకు ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ. 173గా అంచనా వేశామని, రైతులు గరిష్టంగా లాభపడేలా పెట్టుబడి వ్యయం కంటే 105.2 శాతం అధికంగా ఎఫ్ఆర్పీని పెంచినట్టు వివరించారు.

దేశమంతా కులగణన.. కాంగ్రెస్​ విజయం: సీఎం రేవంత్

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ దేశ విధానాలను రాహుల్​గాంధీ ప్రభావితం చేయగలిగారని.. దేశమంతా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కాంగ్రెస్​ పార్టీ విజయమని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘రాహుల్ గాంధీ కొన్నేండ్లుగా దేశవ్యాప్తంగా కులగణన కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్​మంతర్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ పోరాటాలకు, ప్రజల ఒత్తిడికి తలొగ్గి కేంద్రం ఎట్టకేలకు జాతీయ జనగణనతో పాటు కులగణన నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర కేబినెట్​కు ధన్యవాదాలు” అని ఆయన ఎక్స్​లో బుధవారం ట్వీట్​ చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. 

‘‘రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కులగణన ద్వారా రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారనే విషయం స్పష్టంగా తేలింది. ఈ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చరిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది” అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు.  

కులగణనను కాంగ్రెసే వ్యతిరేకించింది: అమిత్ షా  

జనాభా లెక్కలతోపాటు కుల గణన చేయాలని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సామాజిక సమానత్వం, అన్ని వర్గాల హక్కుల పట్ల ప్రధాని మోదీ సర్కారు డెడికేషన్ కు ఇదే నిదర్శనమని చెప్పారు. బుధవారం ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని దశాబ్దాలుగా కుల గణనను వ్యతిరేకించాయి. 

ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడల్లా దీనిపై రాజకీయం చేశాయి. కానీ తాజాగా మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సాధికారతకు దోహదం చేస్తుంది. అణగారిన వర్గాల పురోగతికి కొత్త దారులు చూపుతుంది” అని అమిత్​షా పేర్కొన్నారు.