Chandipura Virus: పాపం.. నలుగురు చనిపోయారు.. ‘కరోనా’ పోయిందనుకుంటే ‘చాందీపుర’ వైరస్ వచ్చింది..!

Chandipura Virus: పాపం.. నలుగురు చనిపోయారు.. ‘కరోనా’ పోయిందనుకుంటే ‘చాందీపుర’ వైరస్ వచ్చింది..!

అహ్మదాబాద్: దేశంలో మరో మహమ్మారి వైరస్ కలకలం రేపుతోంది. ‘చాందీపుర’ అనే వైరస్ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లోని సివిల్ హాస్పిటల్ లో ‘చాందీపుర’ వైరస్ బారిన పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అదే ఆస్పత్రిలో ‘చాందీపుర’ వైరస్ బారిన పడి రాజస్థాన్ కు చెందిన ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ నలుగురు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ ను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (ఎన్ఐవీ) వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. రిజల్ట్స్ కోసం చూస్తు్న్నట్లు సబర్ కాంతా జిల్లా వైద్య శాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు. కరోనా వైరస్ మూలాన ఎంత ప్రాణ నష్టం జరిగిందో మనందరికీ తెలిసిందే. కరోనా వైరస్ చేసిన గాయాలను మర్చిపోయి బతుకుతున్న  తరుణంలో ఈ ‘చాందీపుర’ వైరస్ భయం మొదలైంది. అసలు ‘చాందీపుర’ వైరస్ అంటే ఏంటి..? ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలేంటి..? చిన్నారులే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతుండటానికి కారణాలేంటి..?

ALSO READ | రెక్కల పురుగులతో చాందిపుర వైర‌స్ : నలుగురు చిన్నారులు మృతి

‘చాందీపుర’ వైరస్ అంటే ఏమిటి..? ఈ వైరస్ లక్షణాలేంటి..?

‘చాందీపుర’ వైరస్ తొలి కేసును మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని ‘చాందీపుర’ అనే గ్రామంలో గుర్తించారు. అందువల్ల.. ఈ వైరస్ కు ‘చాందీపుర’ వైరస్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత ఇండియాలోని పలు ప్రాంతాల్లో, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. ‘చాందీపుర’ వైరస్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. తీవ్ర జ్వరం, డయేరియా, మూర్ఛ రావడం, చురుకుదనం కోల్పోవడం.. ఈ వైరస్ ప్రభావం మరింత ముదిరితే కోమా, రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధి పెద్ద వాళ్లకు కూడా సోకే అవకాశం ఉన్నప్పటికీ చిన్నారులే ఎక్కువగా మృత్యువాత పడిన పరిస్థితులున్నాయి. ఈ వైరస్ ఈగను పోలి ఉండే శాండ్ ఫ్లై (గుడ్డీగ) అనే చిన్న కీటకం కుట్టడం వల్ల మనిషికి సోకుతుంది. క్రిమికీటకాల బారిన పడకుండా జాగ్రత్త పడటం తప్ప ‘చాందీపుర’ వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు యాంటీ వైరల్ ట్రీట్ మెంట్ ఏదీ అందుబాటులో లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించడం తప్ప ‘చాందీపుర’ వైరస్ సోకితే సరైన చికిత్స ఏదీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.