ఐపీఎల్ ఫైనల్స్లో గుజరాత్ రికార్డ్స్ కిరాక్.. ఆర్సీబీ గెలవడం కష్టమే! 

ఐపీఎల్ ఫైనల్స్లో గుజరాత్ రికార్డ్స్ కిరాక్.. ఆర్సీబీ గెలవడం కష్టమే! 

Gujarat Titans: ఐపీఎల్ (IPL 2026) క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి గుజరాత్ టైటాన్స్ (GT) గ్రాండ్‌గా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని విధంగా.. 215 పరుగుల టార్గెట్ ని విజయవంతంగా ఛేజ్ చేసి నెవర్ బిఫోర్ రికార్డుని గుజరాత్ క్రియేట్ చేసింది.

లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్.. క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కానీ, శుభ్‌మన్ గిల్ సేన అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి, ఇప్పుడు ఫైనల్‌లో మళ్లీ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అయిపోయింది. మే 31న జరగబోయే ఈ బిగ్ ఫైట్‌కు ముందు గుజరాత్ టీమ్ రికార్డులు, ప్లస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.. 

ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ ట్రాక్ రికార్డ్: 
* 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు ఇది కేవలం 5 ఏళ్లలోనే మూడో ఫైనల్.. ఫైనల్స్ లో వీళ్ళ రికార్డ్ అద్భుతంగా ఉంది. 

* 2022 ఫైనల్: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్‌ను దంచికొట్టి గుజరాత్ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 

* 2023 ఫైనల్: వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరినా.. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో తృటిలో టైటిల్ మిస్ చేసుకుంది.

* 2026 ఫైనల్: ఇప్పుడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో మూడో ట్రోఫీపై కన్నేసింది. దీంతో క్వాలిఫయర్1లో ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ, క్వాలిఫయర్2లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించి.. మళ్లీ ఫైనల్ లో బెంగళూరుని ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. 

హెడ్ టు హెడ్ రికార్డులు:   
లీగ్ మ్యాచ్‌ల పరంగా చూస్తే ఇరు జట్ల మధ్య రికార్డులు పక్కా ఈక్వల్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన 8 లీగ్ మ్యాచ్‌ల్లో గుజరాత్ 4 గెలిస్తే, ఆర్‌సీబీ 4 గెలిచింది. కానీ, ప్లేఆఫ్స్ విషయానికి వస్తే.. ఈ సీజన్ క్వాలిఫయర్-1 లోనే ఈ రెండు జట్లు ఫస్ట్ టైమ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ తేడాతో గుజరాత్‌ను ఓడించింది. కాబట్టి ఈసారి ఫైనల్‌లో ఎలాగైనా ‘రివెంజ్’ తీర్చుకోవాలని గిల్ సేన కసితో రగిలిపోతోంది.

హోమ్ అడ్వాంటేజ్ గుజరాత్‌దే: 
గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుండటం గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ బూస్ట్ ఇస్తోంది. ఈ వేదికపై ఆడిన 27 లీగ్ మ్యాచ్‌ల్లో గుజరాత్ ఏకంగా 16 మ్యాచ్‌లు నెగ్గింది.. ఇక్కడ జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో 3 ఆడగా.. 2 గెలిచి, కేవలం ఒకటి మాత్రమే ఓడింది. లక్ష మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ ఇచ్చే సపోర్ట్ గుజరాత్‌కు కొండంత అండగా మారనుంది.

పిచ్ రిపోర్ట్: 
* బ్యాటింగ్ పారడైజ్: ఈ సీజన్‌లో అహ్మదాబాద్ పిచ్ ప్యూర్ బ్యాటింగ్ పారడైజ్‌లా మారింది. ఇక్కడ రన్స్ వరద పారడం ఖాయం. బౌండరీలు చిన్నవిగా అనిపించేలా బ్యాటర్లు ఈజీగా షాట్లు ఆడొచ్చు.. ఈ గ్రౌండ్‌లో 190–200 స్కోరు అనేది చాలా కామన్ అయిపోయింది.

* టాస్ సెంటిమెంట్: సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బౌలింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ డైమెన్షన్స్, బౌండరీ లైన్స్, డ్యూ ప్యాటర్న్స్‌పై లోకల్ టీమ్ అయిన గుజరాత్ టాప్ ఆర్డర్‌కు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి టాస్ గెలిస్తే చేజింగ్ వైపే మొగ్గు చూపుతారు.

హాట్ ఫేవరెట్‌గా గుజరాత్: 
హోమ్ కండిషన్స్, పిచ్‌పై ఉన్న పట్టు, క్వాలిఫయర్-2 ఇచ్చిన జోష్ చూస్తుంటే.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్‌సీబీ ఈ గుజరాత్ కోటను బద్దలు కొట్టి బ్యాక్-టు-బ్యాక్ కప్ కొడుతుందా?.. లేదంటే గిల్ సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? అనేది వేచి చూడాలి.