
మనకు తెలియని విషయాలు ఈ అనంత విశ్వంలో ఎన్నో దాగున్నాయి. అందులో ఇదొకటి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము గుర్తించదగ్గదే. దేని మ్యాప్ దానిదే అని మనం చదువుకున్నాం.. మరి మన భారతదేశం మ్యాప్‌ను ఎపుడైనా కాస్త పరిశీలనగా చూశారా! అందులో పొరుగు దేశం శ్రీలంక కూడా కనిపిస్తూ ఉంటుంది. సరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్‌లు సగం ఉంటే.. శ్రీలంక మాత్రం పూర్తిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? ఆలోచించరు. అది సగం ఉంటే మనకెందుకు..? అసలు లేకుంటే మనకెందుకు..? అనుకుంటారు. మీకు అవసరం లేదు. మీ పిల్లలకు అవసరం. ఇప్పుడైనా తెలుసుకోండి..
భారత మ్యాప్‌లో శ్రీలంక కనిపిస్తోంది అంటే.. దానర్థం ఆ దేశంతో మనకు సత్సంబంధాలు ఉన్నాయని కాదు. అలా అని తీసేస్తే గొడవ ఉండదుగా అనుకోకండి. అది నేరం. అవును.. భారత దేశ పటంనుండి శ్రీలంకను తీసేస్తే అది చట్టరీత్యా నేరం. ఐక్యరాజ్యసమితిలో ‘లా ఆఫ్ ది సీ’ పేరుతో ఒక అంతర్జాతీయ చట్టం ఉంది. తెలుగులో దీనినే సముద్ర చట్టం(ఓషన్ లా) అంటారు.
ఏమిటి సముద్ర చట్టం..?
యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం తరువాతనే ఈ చట్టం ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ఐక్యరాజ్యసమితి.. 1956లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్సీఎల్ఓసీ-1) కాన్ఫరెన్స్ నిర్వహించగా.. 1958 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ సమావేశంలోనే సముద్రానికి సంబంధించిన సరిహద్దులు, ఒప్పందాలకు సంబంధించి ఏకాభిప్రాయానికి వచ్చారు.
- ALSO READ | తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ
ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు.. ఒక దేశం సముద్ర తీరంలో ఉన్నా లేదా దానిలో కొంత భాగం సముద్రానికి అనుసంధానమై ఉన్నా.. అటువంటప్పుడు ఆ దేశ సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతం కూడా ఆ దేశ మ్యాప్‌లో చూపించాలని నిర్ణయించారు. ఆ బేస్ లైన్ దూరమనేది.. 200 నాటికల్ మైళ్లు(370 కిలోమీటర్లు). భారతదేశం మ్యాప్‌లో శ్రీలంకను చూపించడానికి కారణం ఇదే. ఎందుకంటే శ్రీలంక.. భారత్‌కు 200 నాటికల్ మైళ్లలోపే ఉంటుంది. భారతదేశ సరిహద్దు నుంచి 200 నాటికల్ మైళ్ల దూరంలో వచ్చే అన్ని ప్రదేశాలు మ్యాప్‌లో చూపించారు.
ఇంకా చెప్పాలంటే, భారతదేశంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంక కేవలం 18 మైళ్ల దూరంలోనే ఉంది. అందుకే భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలు ఇండియా మ్యాప్ లో పూర్తిగా లేకపోవడానికి.. శ్రీలంక పూర్తిగా ఉండడానికి అసలు కారణం ఇదన్నమాట.