న్యూఢిల్లీ: ఇండియా పీఎంఐ డేటా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ (ఈ నెల 20న), ఇండియా–యూఎస్ వాణిజ్య ఒప్పంద చర్చలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కదలికలను గమనించాలని ట్రేడర్లకు సలహా ఇచ్చారు.
గత వారం సెన్సెక్స్ 1,346 పాయింట్లు (1.62శాతం), నిఫ్టీ 417 పాయింట్లు (1.64శాతం) లాభపడ్డాయి. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్‌కు పరిష్కారం కనిపెట్టడం, బలమైన క్యూ2 ఫలితాలు, ద్రవ్యోల్బణం తగ్గుదల మార్కెట్‌కు ఊపునిచ్చాయి. ‘‘ఇండియా ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆదాయం పెంచుకున్న కంపెనీలపై దృష్టి పెట్టడం మంచిది” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా మాట్లాడుతూ, ‘‘ఎన్‌డీఏకి బిహార్‌లో ఫుల్ మెజారిటీ లభించడంతో దేశంలో రాజకీయ స్థిరత్వం మెరుగుపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ ఫోకస్‌లో ఉంటాయి” అని చెప్పారు. అక్టోబర్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 0.25 శాతానికి తగ్గడం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. నవంబర్ 21న విడుదలయ్యే సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, ఫారెక్స్ రిజర్వులు, ఇన్‌ఫ్రా డేటాపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
