జూరాల నుంచి శ్రీశైలం మార్పునకు కారణమేంటి?

జూరాల నుంచి శ్రీశైలం మార్పునకు కారణమేంటి?
  • సీఎస్‌‌‌‌‌‌‌‌కు ఫోరం ఫర్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ లేఖ
  • అవినీతిపై ఎందుకు విచారణ జరపలేదని నిలదీత
  • ప్రజలకు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల సోర్స్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలా మార్చారని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎస్ శాంతికుమారికి ఫోరం ఫర్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జూరాల నుంచి 25 రోజుల్లో 70 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసేలా ఇస్కీ (ఇంజనీరింగ్​ స్టాఫ్​ కాలేజీ ఆఫ్​ ఇండియా) డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిందని గుర్తు చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించి, దానికి అనుగుణంగా డీపీఆర్‌‌‌‌‌‌‌‌ సమర్పించాలని 2015 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 28న ఆదేశించినట్లు తెలిపారు. ఇస్కీ కేవలం మ్యాపులు, టోఫోషీట్లను పరిశీలించి రెండు వారాల్లో మరో డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిందని, ఇందులో జూరాలతో పాటు శ్రీశైలం నుంచి కూడా నీటిని తరలించొచ్చనే రెండు ఆప్షన్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిందని పేర్కొన్నారు. 2015 మే 21న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ శ్రీశైలం నుంచే ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 90 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారని, జీవో నం.105 ద్వారా 2015 జూన్‌‌‌‌‌‌‌‌ 10న రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చారని వివరించారు. ప్రాజెక్టును 48నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికీ పూర్తి కాలేదని తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యం

కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ ప్రాజెక్టులు ప్రారంభించారని, ఈ విషయాన్ని ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన మూడు సర్కిల్స్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈలు తాము ఆర్‌‌‌‌‌‌‌‌టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎన్‌‌‌‌‌‌‌‌జీటీని ఆశ్రయిస్తే నిరుడు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 22న పర్యావరణ ఉల్లంఘనలకు గాను గ్రీన్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.920 కోట్ల ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకపోవడం, ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వడంలో నిర్లక్ష్యంపై కోర్టుల్లో డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయని తెలిపారు. మోటార్ల కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతిపై సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ఆలస్యమై ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.35,200 కోట్ల నుంచి రూ.57 వేల కోట్లకు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. ఇస్కీ సమగ్ర స్టడీ చేసి జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టాలని డీపీఆర్‌‌‌‌‌‌‌‌లో సూచించినా కేవలం రాజకీయ నిర్ణయంతో దాన్ని శ్రీశైలానికి మార్చారని తెలిపారు. ప్రాజెక్టు సోర్స్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ను శ్రీశైలానికి మార్చినపుడు సమగ్ర సర్వే చేయలేదని, కేవలం మ్యాపులు మాత్రమే పరిశీలించి కొత్త డీపీఆర్‌‌‌‌‌‌‌‌ రూపొందించారని పేర్కొన్నారు. మోటార్ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు.

వెబ్​సైట్​లో డీపీఆర్​ పెట్టాలి

ప్రాజెక్టు డీపీఆర్‌‌‌‌‌‌‌‌ అడిగితే రూ.28,500 చెల్లించాలని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులు సమాధానమిచ్చారని పద్మనాభ రెడ్డి తెలిపారు. అనేక ఆరోపణలు ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకునేందుకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో డీపీఆర్‌‌‌‌‌‌‌‌ పెట్టాలన్నారు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే నీళ్లలో తాగునీటి అవసరాలను మినహాయిస్తే మిగిలే 70 టీఎంసీలతో 10 లక్షల ఎకరాలకు ఎలా నీళ్లు ఇవ్వగలుగుతారో సమాధానం చెప్పాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజలకు చేకూరే ప్రయోజనం (కాస్ట్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌ రేషియో) వివరాలు ఇవ్వాలని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోసేందుకు 4,560 మెగావాట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ అవసరమని, ఇందుకు ఖర్చయ్యే మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు.