
సూర్యాపేట, వెలుగు: ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని మనస్తాపం చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా ఏరియా ఆస్పత్రిలో బచ్చలకూరి మధుసూదన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. కాగా.. ఆరు నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారడంతో శుక్రవారం ఉదయం ఇంట్లో లైజాల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మధు ఆత్మహత్యాయత్నం చేశాడనే సమాచారంతో సహోద్యో గులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జీతాలు రాక తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని, ఆందోళనను అడ్డుకోవద్దని ఉద్యోగులు పోలీసులను వేడుకున్నారు. కాగా.. ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగి కోసం తోటి ఉద్యోగులు స్థానిక షాపుల్లో, కనకదుర్గ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ తమ దీనస్థితిని తెలియజేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను మధు కుటుంబానికి అందజేస్తామని పలువురు ఉద్యోగులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధును బీఆర్ టీయూ నేతలు పరామర్శించారు. ప్రస్తుతం మధు పరిస్థితి నిలకడగా ఉంది.