వైఎస్ జగన్, షర్మిల మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది?

వైఎస్ జగన్, షర్మిల మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది?

ఇడుపులపాయ: ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాక ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అయితే పొలిటికల్‌గా భిన్నాభిప్రాయాలే తప్ప, కుటుంబ పరంగా ఎటువంటి విభేదాలూ లేవని రెండు వైపుల నుంచి వారి అధికార ప్రతినిధులుగా చెప్పేవాళ్లు వివరణ ఇస్తూ వస్తున్నారు. కానీ తమ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలోనూ జగన్, షర్మిల మధ్య గ్యాప్ మరోసారి స్పష్టంగా కనిపించింది. ఈ రోజు (జులై 8న) వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఉదయం నివాళి అర్పించడం, ప్రార్థనలు చేయడం లాంటి కార్యక్రమాల్లో షర్మిల, తన తల్లి విజయమ్మ మాత్రమే కనిపించారు. గతంలో కుటుంబమంతా కలిసి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఈ ఏడాది వైఎస్ జగన్ కానీ, ఆయన భార్య భారతి కానీ కనిపించలేదు. షర్మిల వస్తోందన్న కారణంతో జగన్ రాలేదన్న చర్చ నడుస్తోంది. అందుకే వైఎస్ భారతి కూడా వేరుగా వెళ్లి నివాళి అర్పించారని, జగన్ విడిగా సాయంత్రం జయంతి కార్యక్రమం పెట్టుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ వైఎస్ వివేకా వర్థంతి సందర్భంగా కూడా వైఎస్ విజయమ్మ, షర్మిల మాత్రమే వెళ్లి నివాళి అర్పించారు. కానీ జగన్ వెళ్లలేదు.
పొలిటికల్ ఇంట్రెస్ట్‌ వేరు కావడమేనా?
వైఎస్ జగన్ ఏపీలో సీఎంగా ఉండడం, అక్కడ షర్మిలకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యం లభించకపోవడంతో తానే స్వయంగా తెలంగాణలో తండ్రి వారసత్వం అంటూ పార్టీ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాల వల్లే అన్నా చెల్లెల్ల మధ్య గ్యాప్ పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఇద్దరి రాజకీయ దారులు వేరు కావడం, తెలంగాణ, ఆంధ్రలలో ఇద్దరి పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు, ప్రాంతాల వారీగా అవసరాలు, వ్యూహాలు పూర్తిగా భిన్నంగా ఉండడంతోనే  జగన్‌ గతంలోనే ఆమెను రాజకీయ పార్టీ పెట్టొద్దని వారించిన నేపథ్యంలోనే ఇరువురి మధ్య విభేదాలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా పోతానని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటా కోసం ఎవరితోనైనా పోరాడతానని షర్మిల ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ఆమె నిర్ణయాలకు అన్న నుంచి మద్దతు లేకున్నా.. తల్లి విజయమ్మ మాత్రం తోడుగా ఉంటున్నారు. షర్మిల చేపట్టే కార్యక్రమాలన్నిటిలోనూ ఆమె పక్కనే ఉంటున్నారు.